UNGA : భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly) అధ్యక్షుడు ఫిలేమాన్ యాంగ్ (Philemon Yang) స్పందించారు. రెండు దేశాలు నిగ్రహం పాటించాలని, తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాద దాడులను, పౌరులపైన, పౌరసమాజానికి సంబంధించిన మౌలికసదుపాయాలపైన దాడులను తాను తీవ్రంగా ఖండిస్తానని ఆయన మరోసారి నొక్కి చెప్పారు.
చర్చలు, దౌత్య మార్గం ద్వారానే ఉద్రిక్తతలకు పరిష్కారం లభిస్తుందని, అప్పుడు దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుందని యాంగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆయన ఒక పోస్టు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని, పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సేనలు మెరుపు దాడులు చేశాయి. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
బుధవారం తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 1.30 మధ్య భారత సేనలు సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కోఆర్డినేషన్‌తో ఈ దాడులు చేశారు. దాంతో పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ క్రమంలో యూఎన్జీఏ అధ్యక్షుడు యాంగ్ నిగ్రహం పాటించాలంటూ సలహా ఇచ్చారు.