Supreme Court : అహ్మదాబాద్ (Ahmedabab) లో జరిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలెట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో AAIB ఇచ్చిన ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
ఏఏఐబీ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతారాహిత్యమేనని పేర్కొంది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) లకు నోటీసులు ఇచ్చింది.
కాగా ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయినట్లు ఏఏఐబీ నివేదికను సమర్పించింది. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్‌ను ప్రశ్నించాడని రిపోర్ట్‌లో పేర్కొంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్‌పిట్‌లో అవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. రెండు స్విచ్‌లు ఒక సెకను తేడాతో ఆగినట్లు నివేదికలో పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని తెలిపింది.
ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వెల్లడైన తర్వాత అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఎయిరిండియా విమానం పైలటే ఇంధన స్విచ్‌ను షట్‌డౌన్ చేశారని ఊహాజనిత వార్తలు ప్రచురితమయ్యాయి. దర్యాప్తు కొనసాగుతోన్న దశలో ఇలాంటి చర్యలు బాధ్యతారాహిత్యమని ఏఏఐబీ ఖండించింది. ఈ నేపథ్యంలో ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోసం పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు ఏం జరిగిందో గుర్తించేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్‌ను పరిశీలించేందుకు నిపుణులను అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు.
దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందించింది. ఎవరైనా బాధ్యతారహితంగా పైలట్‌ది తప్పు అని చెప్తే.. అది ఆ కుటుంబంపై ఎంతో ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఏఏఐబీ తుది నివేదికలో పైలట్ పేరు లేకపోతే.. అప్పుడు ఏం చేస్తామని ప్రశ్నించింది.