బెంగుళూరు: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(Air India Express)లో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. బెంగుళూరు నుంచి వారణాసికి వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాత్రూం కోసం వెతుకుతున్న ఓ ప్రయాణికుడు .. విమానం గాలిలో ఉన్న సమయంలో కాక్‌పిట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు విమాన సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు జరుగుతున్నట్లు సంస్థ పేర్కొన్నది. వారణాసికి వెళ్తున్న తమ విమానంలో ఓ వ్యక్తి కాక్‌పిట్ ఎంట్రీ ఏరియాలోకి ప్రవేశించాడని, అయితే రక్షణాత్మక చర్యల్లో భాగంగా ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. విమానం ల్యాండైన తర్వాత సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.