Bhanu Mushtaq : కర్ణాటక (Karnataka) లో ప్రతిపక్ష బీజేపీ (BJP) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినా, కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఖాతరు చేయకుండా ప్రముఖ రచయిత, బుకర్‌ప్రైజ్ విజేత (Buker prize winner) భాను ముస్తాక్ (Banu Mushtaq) మైసూరు (Mysuru) లో దసరా ఉత్సవాల (Dusserah celebrations) ను ప్రారంభించారు. సోమవారం ఉదయం మైసూరుకు చేరుకున్న ఆమె చాముండేశ్వరి దేవికి పుష్పాలను సమర్పించి ఉత్సవాలను మొదలుపెట్టారు.
కాగా కర్ణాటకలోని మైసూరు నగరంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ముఖ్య వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారికి ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత భాను ముస్తాక్‌కు ఆహ్వానం పంపింది. ఈ నెల 22న మైసూరులో జరిగే దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని ఈ నెల 3న ఆహ్వానించింది.
అయితే దీనిపై ప్రతిపక్ష బీజేపీ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. భాను ముస్తాక్‌కు ఆహ్వానాన్ని సవాల్ చేస్తూ హెచ్ఎస్ గౌరవ్ అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. భాను ముస్తాక్ హిందూ మతానికి వ్యతిరేకంగా, కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమె చేతుల మీదుగా దసరా ఉత్సవాలను ప్రారంభించడం హిందూ సంప్రదాయనికి విరుద్ధమని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి భాను ముస్తాక్‌కు ఆహ్వానాన్ని రద్దు చేసుకునేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
కానీ ఆ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో గౌరవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. భాను ముస్తాక్‌ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం ప్రజల చట్టపరమైన హక్కులకుగానీ, రాజ్యాంగపరమైన హక్కులకుగానీ భంగం కలిగించదుగా..! అని వ్యాఖ్యానించింది. ఇదిలావుంటే భాను ముస్తాక్ బుకర్ ప్రైజ్ గెలిచినందుకు గౌరవంగా దసరా ఉత్సవాల ప్రారంభానికి ఆహ్వానించామని, అందులో తప్పేముందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు.