Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ కొత్త వీసా విధానం నేపథ్యంలో మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా వన్ టైమ్ ఫీజును సుమారు రూ.88లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దాంతో ఐటీ దిగ్గజాల స్టాక్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 82,151.07 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. ఏ దశలోనూ మళ్లీ మార్కెట్లు కోలుకోలేదు. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోఫోర్జ్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ఇంట్రాడేలో 82,583.16 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,997.29 పాయింట్ల వరకు పతనమైంది. చివరకు 466.26 పాయింట్లు పతనమై.. 82,159.97 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 124.70 పాయింట్లు తగ్గి 25,202.35 వద్ద ముగిసింది. దాదాపు 1,715 షేర్లు లాభపడగా.. 2,467 షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.7శాతం పడిపోయాయి. ఐటీ ఇండెక్స్ 2.7 శాతం, ఫార్మా 1.2 శాతం పతనం కాగా.. పవర్ ఇండెక్స్ 1.6 శాతం, చమురు, గ్యాస్ ఇండెక్స్ 0.4 శాతం, మెటల్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి.
నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సిప్లా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. ట్రంప్ పాలసీ విధానంతో అనిశ్చితి నెలకొన్నది. హెచ్1బీ వీసా విధానం కీలకం. భారతీయ ఐటీ కంపెనీలకు యూఎస్ చాలా కీలకం. ఈ కంపెనీలు తమ ఆదాయంలో ఎక్కువ భాగం యూఎస్ మార్కెట్ నుంచే వస్తుంది. కంపెనీలు తమ ఉద్యోగులను యూఎస్ మార్కెట్లో ఆన్ సైట్లో చేసేందుకు పంపుతుంటాయి. దీనికి హెచ్1బీ వీసాలు అవసరం. ట్రంప్ ఈ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకు మాత్రమే కొత్త ఫీజు వర్తిస్తుందని.. ఇప్పటికే ఉన్న వీసాదారులకు కాదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. యూఎస్‌లోకి తిరిగి ప్రవేశించేందుకు అదనపు ఫీజులు ఉండవని.. ఇది ఐటీ కంపెనీలకు నష్టాలను పరిమితం చేస్తుంది. కానీ కంపెనీలు ఈ భారాన్ని క్లయింట్లకు బదిలీ చేయగలవా? అనేది అనిశ్చితి ఉన్నది. అయితే, శుక్రవారం భారత మార్కెట్లు ముగిసిన వెంటనే ట్రంప్ కొత్త వీసా విధానాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే ఐటీ స్టాక్ భారీగా పతనమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఊహించినట్లుగానే ఐటీ స్టాక్స్ భారీగా పడిపోయాయి.