Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. భర్త కళ్లెదుటే వృద్ధ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు, కోటె బీడి ప్రాంతం, నీలమంగళలో జరిగింది. మృతురాలిని శోభ (70) గా గుర్తించారు. నిందితుడు గొంతు కోసి ఆమెను చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగనాథ్, శోభ అనే వృద్ధ దంపతులు ఒంటరిగా జీవిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. భర్త రంగనాథ్ కొన్నేళ్లుగా పక్షవాతం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 15 ఏళ్లుగా ఆయన వీల్ ఛైర్, మంచానికే పరిమితమయ్యారు. అయితే, వారికి డబ్బుకు లోటు లేకపోవడంతో శోభ ఎక్కువగా నగలు ధరించేది.
పైగా ఆమె తండ్రి నగల షాపు ఓనర్ కావడంతో బంగారానికి లోటు లేదు. అయితే, ఇలా నగలు ధరించడం, పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండటం, భర్తకు పక్షవాతం వంటివి ఆమె హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈమె నగలపై దగ్గర్లోని ఒక హోల్ సేల్ షాప్ ఓనర్ అయిన శివ కుమార్ కన్నేశాడు. దీంతో అర్ధరాత్రి 1.03 నిమిషాలకు వారి ఇంట్లోకి చొరబడి డబ్బు, నగల కోసం వెతికాడు. కానీ, ఇంట్లో ఏవీ కనిపించలేదు. దీంతో శోభ ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లేందుకు ఆమెను గొంతుకోసి చంపాడు. అది కూడా భర్త కళ్లముందే హత్య చేశాడు. భర్తకు పక్షవాతం కారణంగా, అతడు కదలలేడని తెలిసీ హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారు చైన్, బంగారు గాజులు, ఇతర నగల్ని శివకుమార్ ఎత్తుకెళ్లాడు. ఈ నగల బరువు 450 గ్రాములుకాగా, వాటి విలువ రూ.65 లక్షలుగా ఉంది.
నగలు తీసుకుని, బైకు మీద పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం శోభ భర్తకు ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చిన డాక్టర్.. రక్తపు మడుగులో పడి ఉన్న శోభను, ఆ పక్కనే మంచంపై అచేతనంగా ఉన్న భర్త రంగనాథ్‌ను చూశాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించగా.. శివ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. అతడి బైక్ నెంబర్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. కానీ, ఈలోపు ఉదయం అతడు సాధారణ వ్యక్తిలాగా ఘటనా స్థలానికి వచ్చాడు. పోలీసులు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నప్పుడు ఇతరుల్లాగే వచ్చి, కొద్దిసేపు ఉండి వెళ్లాడు.
విచారణ అనంతరం పోలీసులు శివ కుమార్‌ను, అతడి వద్ద ఉన్న బైకు, నగలు, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక.. శోభ భర్తకు పక్షవాతంతోపాటు కాస్త మతిమరుపు సైతం ఉండటం వల్ల ఘటన గురించి అతడు వివరించే పరిస్థితిలోలేడు. అందువల్ల ఆయన నుంచి సరైన వివరాలు అందలేదు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాల వల్ల నిందితుడిని గుర్తించారు.