దుబాయ్: వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న పురుషుల అండర్-19 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకూ సాగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు 41 మ్యాచ్‌లు ఆడనున్నాయి. దాదాపు ప్రతి ఐసీసీ టోర్నీలో ఒకే గ్రూపులో ఉండే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్.. ఈసారి వేర్వేరు గ్రూపుల్లో ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్ ఉండగా ‘బీ’లో జింబాబ్వే, పాకిస్థాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్ ఆడతాయి. ‘సీ’లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక పోటీపడనుండగా ‘డీ’లో టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘానిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. రౌండ్ రాబిన్ విధానంలో జరుగబోయే ఈ టోర్నీలో భారత జట్టు.. జనవరి 15న యూఎస్ఏతో ఆడబోయే మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది.