Jammu and Kashmir : జమ్మూలోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్, ఉధంపూర్ జిల్లా, బంసంత్‌ఘర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో జైషే మహ్మద్ అనే తీవ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ మావి అలియాస్ మావియా మరణించినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతోపాటు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు గతంలోనే పోలీసులకు సమచారం అందింది. తాజాగా తీవ్రవాదులకు సంబంధించిన మరింత కీలక సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా జమ్మూ పోలీసులకు అందింది. దీంతో మంగళవారం నుంచి అక్కడ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో తీవ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒకడు మావి కాగా, మరొకడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
తీవ్రవాదులు ఇక్కడి అటవీ ప్రాంతంలోని ఒక గుహలో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ గుహను పోలీసులు పేల్చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు, భద్రతా సిబ్బంది సమన్వయంతోనే తీవ్రవాదుల ఎన్కౌంటర్ సాధ్యమైందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.