న్యాల్కల్, ఆగస్టు 27: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ఇద్దరు మండలవాసులు మోసపోయారు. బాధితులు మంగళవారం హద్నూర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఎల్ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్లో వేస్తామని మండలంలోని బసంతపూర్ గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, తెలిసిన వారి నంబర్ ఇవ్వాలని కోరడంతో మరో ఇద్దరి ఫోన్ నంబర్లు ఇచ్చాడు. అందులో ఒకరికి ఫోన్ సైబర్ నేరగాడు చేశాడు. అతడి ఖాతాలోనూ డబ్బులు లేకపోవడంతో అతడు మరో వ్యక్తి సుదర్శన్‌రెడ్డికి కాన్ఫరెన్స్ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నంబర్ తెలుసుకొని డబ్బులు పంపినట్లు మెసేజ్ పె ట్టాడు. దానికి ఓకే చేయాలని చెప్పడంతో ఓకే కొట్టాడు. వెంటనే ఖాతాలో ఉన్న రూ.99 వేలు మాయమయ్యాయి. ఇదంతా ఫోన్లో మాట్లాడుతుండగానే జరిగిపోయింది.
మండలంలోని శంశోల్లాపూర్కు చెందిన రామకృష్ణారావు బీదర్‌లో మెడికల్‌లో పనిచేస్తున్నాడు. అతడికి సైబర్ నేరగాడు ఫోన్లో పాత నాణేలు ఇస్తే రూ.12 లక్షలు ఇస్తామని ఆశ చూపాడు. దానికి అతను తన వద్ద ఉన్న పాత నాణేలను ఫొటో తీసి పంపాడు. రూ.12 లక్షలు వేయాలంటే కొంత జమ చేయాలని సైబర్ నేరగాడు చెప్పడంతో రూ.2, 6, 20, 30, 40 వేలు, ఇలా విడతల వారీగా రూ.99 వేలు వేశాడు. ఇం కా డబ్బులు చెల్లించాలని బాధితుడిని కోరగా తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో వెంటనే ఫోన్ కట్ అయిపోయింది. ఎంతకూ ఫోన్ కలవకపోవడంతో మోసపోయానని తెలుసుకొని హద్నూర్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బ్యాంకు ఖాతా వివరాలను జిల్లా సైబర్ క్రైమ్ అధికారులకు పంపి చర్యలు తీసుకుంటామని హద్నూర్ పోలీసులు తెలిపారు. ఫోన్లలో కనిపించే ప్రతి లింక్‌ను ఓపెన్ చేయొద్దని, ఎవరైనా సబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం అందించాలని ఎస్ఐ రామానాయుడు పేర్కొన్నారు.