జహీరాబాద్, మే 5 : మహారాష్ట్రలోని తుల్జాభవానీమాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామ శివారులోని 65వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్‌కుమార్ వివరాల ప్రకారం.. స్థానిక పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామ శివారులోని 65వ ముంబాయి-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి ఎక్కుతుండగా ట్రక్కు ఓవర్ లోడ్ కారణంగా వెనక్కి వచ్చి టాటాఏస్ వాహనాన్ని తగలింది. దీంతో టాటాఏస్ వాహనం కొద్ది దూరం వెనక్కి వెళ్లింది. ఇదే క్రమంలో మహారాష్ట్ర తుల్జాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు వేగంగా టాటాఏస్ ట్రాలీ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుైజ్జెంది. కారులో ప్రయాణిస్తున్న మైలాపూర్ రోహిత్ (16), కాసుల మహేశ్‌గౌడ్ (26) అక్కడికక్కడే మృతిచెందారు. నంపల్లి కార్తీక్ (27), కె.నర్సింహులు (32), జితేంద్రసాయి (9)తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్‌కుమార్ హుటాహుటిన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై తెలిపారు.