సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగం పేరుతో ప్రీపెయిడ్ టాస్క్‌లంటూ నమ్మించి, ఆ తర్వాత పెట్టుబడులు పెట్టించి సైబర్‌నేరగాళ్లు బాధితుల నుంచి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. నగరంలోని అబిడ్స్ ప్రాంతానికి చెందిన 35ఏళ్ల మహిళను సెప్టెంబర్1న పార్ట్‌టైమ్ జాబ్ ఇస్తామంటూ టెలిగ్రామ్ ద్వారా ‘క్యూబ్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్’ అనే కంపెనీ నుంచి చంద్రిక అనే మహిళ సంప్రదించారు. గూగుల్ రివ్యూస్ వంటి వాటికి చిన్నచిన్న మొత్తాలను చెల్లించిన తర్వాత ప్రిపెయిడ్ జాబ్స్ పేరుతో పెట్టుబడులు పెట్టాలని నమ్మించారు. దీంతో బాధితురాలు సెప్టెంబర్ 1నుంచి 5వ తేదీ మధ్య పలు దఫాలుగా రూ.10,25,550 డిపాజిట్ చేయగా.. నేరగాళ్లు ఆమెకు రూ.15,57,900 ఫేక్ బ్యాలెన్స్ చూపించారు. వాటిని బ్లాక్ చేసి, విత్‌డ్రా చేయాలంటే మరింత డబ్బు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆసిఫ్‌నగర్‌కు చెందిన 44ఏళ్ల వ్యక్తికి మైకేల్ పేజ్ ఐటీ నుంచి గత నెల 28న వీణకత్రి అనే మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తానని నమ్మించారు. చిన్నచిన్న మొత్తాలు లాభాలుగా ఇచ్చి నమ్మించిన తర్వాత పెట్టుబడులు పెట్టాలంటూ సూచించారు. ఈ క్రమంలో అతని అకౌంట్లో రూ.3.49లక్షలు బ్యాలెన్స్ ఫ్రీజ్ అయి ఉన్నాయని, అవి రిలీజ్ చేయాలంటే రూ.3.5లక్షలు చెల్లించాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. అప్పటికే బాధితుడు రూ.1,61,720 పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.