సరిగ్గా రెండేండ్ల క్రితం.. 2020 మార్చి 22న.. యావత్ భారతదేశం.. ఇండ్లకే పరిమితమైంది. జనతా కర్ఫ్యూ కారణంగా ఆ రోజంతా ఎవరూ గడపదాటి బయటకు రాలేదు. అవి కరోనా వైరస్ విజృంభిస్తున్న తొలిరోజులు. వైరస్నుఎలా కట్టడి చేయాలో.. దాని బారి నుంచి ఎలా రక్షించుకోవాలో.. ఏ మందులు వాడాలో అర్థంకాని పరిస్థితి. అందరిలోనూ ప్రాణభయం.
లాక్డౌన్! మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. మార్చి 25 నుంచి కేంద్రం కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఇది మే 31 వరకు కొనసాగింది. ఆ తరువాత దశలవారీగా సడలింపులు మొదలయ్యాయి. ఈ రెండేండ్లలో కరోనా ఎన్నో పాఠాలు, గుణపాఠాలుబోధించింది. మరెన్నో జాగ్రత్తలు నేర్పింది.
– హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ)
కొవిడ్ కట్టడి చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు. కొవిడ్ వార్డులో పర్యటించి ధైర్యాన్ని నింపారు. కష్టకాలంలో ప్రభుత్వ దవాఖానలు ప్రజలను ఆదుకున్నాయి. ప్రభుత్వం రూ.వందల కోట్ల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించింది. ప్రాణాలను లెక్కచేయకుండా వైద్యసిబ్బంది నిరంతరం శ్రమించారు.
-శ్రీనివాస్‌రావు, ప్రజారోగ్యశాఖ సంచాలకుడు
కొవిడ్ కట్టడిలో ఆశ కార్యకర్తలు మొదలు అన్ని స్థాయిల వైద్యసిబ్బంది చేసిన సేవలు అసమానం. ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. గాంధీ దవాఖాన నోడల్ సెంటర్‌గా దేశానికే ఆదర్శంగా నిలిచింది. సుమారు 85 వేల మంది ప్రాణాలను కాపాడగలిగాం. ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలను, ఔషధాలను అందుబాటులో ఉంచింది.
– రాజారాం, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్