e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News ఉద్యోగుల విభజనకు రెండు కమిటీలు

ఉద్యోగుల విభజనకు రెండు కమిటీలు

 • మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
 • జిల్లాస్థాయి పోస్టులకు ఒక కమిటీ ఏర్పాటు
 • జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులకు మరొకటి
 • ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో ప్రక్రియ మొదలు
 • సీనియార్టీకి ప్రాధాన్యం.. త్వరలో పూర్తి షెడ్యూల్‌
 • కమిటీల ఏర్పాటుపై ఉద్యోగుల హర్షాతిరేకాలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల విభజనకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. కొత్త జిల్లాలు, జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన విధివిధానాలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీవో 317 జారీ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కి లోబడి కొత్త జోన్లు, జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజనను చేపట్టనున్నారు. ఉద్యోగుల కేటాయింపు కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల నివేదికల ఆధారంగా ఉద్యోగులను కేటాయించనున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో విభజన, కేటాయింపులు ప్రారంభం కానుండగా, మిగతా జిల్లాల్లో కోడ్‌ ముగిశాక ప్రక్రియను చేపడతారు. పూర్తిస్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని సీఎస్‌ ఆ జీవోలో పేర్కొన్నారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొన్నా సీనియార్టీ ప్రకారమే కేటాయింపులు జరుగనున్నాయి.

మార్గదర్శకాలు ఇవీ..

 • రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం లోకల్‌ క్యాడర్‌ పోస్టులను ప్రభుత్వం గతంలోనే ఖరారు చేసింది. ఈ ఆదేశాల ప్రకారం అన్ని శాఖల్లో జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టులవారీగా క్యాడర్‌ స్ట్రెంత్‌ను బట్టి ఉద్యోగులను కేటాయిస్తారు.
 • ఈ క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం అన్ని శాఖల్లో పనిచేస్తున్న వారిని, జోన్లు, మల్టీజోన్‌, జిల్లాల వారీగా మంజూరు చేసిన పోస్టుల ప్రకారం పంపిణీ చేస్తారు. ఇదంతా పారదర్శకంగా, సమతులంగా జరుగనున్నది.
 • పాత క్యాడర్‌, సీనియార్టీ ప్రకారం ఉద్యోగుల జాబితాను అన్నిశాఖల విభాగాధిపతులు సిద్ధం చేయాలి. కేటాయింపు సందర్భంగా ఏ ఒక్క ఉద్యోగినీ మినహాయించరాదు. సెలవులో ఉన్న వారితో పాటు సస్పెన్షన్‌, ట్రైనింగ్‌, డిప్యుటేషన్‌, ఫారిన్‌ సర్వీస్‌లో ఉన్న వారిని సైతం పరిగణనలోకి తీసుకోవాలి.
 • సెలవుపై వెళ్లిన ఉద్యోగితో పాటు, సస్పెన్షన్‌, శిక్షణ, డిప్యుటేషన్‌, ఫారిన్‌ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా, కేటాయించిన జిల్లాలో రిపోర్ట్‌ చేసినట్టుగానే భావించాలి. సెలవులో, సస్పెన్షన్‌లో ఎలా ఉంటే కొత్త క్యాడర్‌లోనూ అలాగే కొనసాగిస్తారు.
 • ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారమే, కొత్త లోకల్‌ క్యాడర్‌కు అనుగుణంగా కేటాయింపులుంటాయి.

జిల్లా క్యాడర్‌ పోస్టులు

 • కొత్త జిల్లాల క్యాడర్‌ కోసం కేటాయించిన వర్కింగ్‌ స్ట్రెంత్‌కు లోబడి, పూర్వ జిల్లాల క్యాడర్‌లోని అన్ని పోస్టులకు అవి ఎక్కడున్నా పరిగణనలోకి తీసుకొంటారు.
 • ఎనిమిది కొత్త జిల్లాలైన హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు పాత 10 జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ జిల్లాలతో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని వారు, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోని పోస్టులతో పాటు, పూర్వపు జిల్లాల్లోని పోస్టులకు సైతం అర్హులు అవుతారు.

జోనల్‌ క్యాడర్‌ పోస్టులు

 • కొత్త జోనల్‌ లేక మల్టీ జోనల్‌ క్యాడర్‌కు కేటాయించిన ఉద్యోగులను పూర్వపు జోనల్‌ క్యాడర్‌గానే పరిగణిస్తారు.
 • పూర్వ జోన్‌-5 క్యాడర్‌ ఉద్యోగులను కొత్త జోన్లలో 1 నుంచి 4 వరకు కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకొంటారు. (అంటే ఈ జోన్‌లోని నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, పాత మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట ప్రాంతంలో వచ్చే పోస్టులను మినహాయిస్తారు) జనగామ జిల్లా జోన్‌ -2లో ఉండగా, ఈ పోస్టులను సైతం పరిగణనలోకి తీసుకొంటారు.
 • పూర్వపు జోన్‌-6 క్యాడర్‌ ఉద్యోగులను కొత్త జోన్లు అయిన జోన్‌-5, జోన్‌-6, జోన్‌-7కు పరిగణనలోకి తీసుకొంటారు. జోన్‌-2 పరిధిలోని ఉద్యోగులను జోన్‌ -3 పరిధిలోకి వచ్చే కామారెడ్డి, మెదక్‌ (పూర్వ మెదక్‌ జిల్లా పరిధిలోని సిద్దిపేట కూడా) పరిగణనలోకి తీసుకొంటారు.

మల్టీ జోనల్‌ క్యాడర్‌ పోస్టులు

 • పూర్వ జోన్‌-5 క్యాడర్‌ ఉద్యోగులను మల్టీ జోన్‌-1 (పాత 5వ జోన్‌లోని నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌ (పూర్వ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులను మినహాయించి) జనగామ జిల్లాలోని పోస్టులను మల్టీ జోన్‌-2కు కేటాయిస్తారు.
 • పూర్వ జోన్‌-6 క్యాడర్‌ ఉద్యోగులను(జనగామ జిల్లాలోని పోస్టులను మినహాయించి) మల్టీ జోన్‌-2, మల్టీ జోన్‌-1కు కేటాయిస్తారు. నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, పూర్వపు మెదక్‌ జిల్లాలో భాగంగా మెదక్‌ జిల్లాలోని పోస్టులు పాత జోన్‌-6లో ఉండగా, వాటిని కొత్త మల్టీ జోన్ల ప్రకారం కేటాయిస్తారు.
 • ఇంతకుముందు తెలంగాణ మొత్తం ఒకే మల్టీ జోన్‌గా ఉండగా, ఈ మల్టీ జోన్‌ పరిధిలో ఉద్యోగులంతా తాజా రాష్ట్రపతి ఉత్తర్వుల (పీవో-2018) ప్రకారం ఏర్పడ్డ రెండు మల్టీ జోన్లకు కేటాయించవచ్చు.
- Advertisement -

మార్గదర్శకాల్లో మరిన్ని ముఖ్యాంశాలు:

 • ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగంగా ప్రదర్శిస్తారు. కేటాయించిన ఉద్యోగుల సంఖ్య, కొత్త లోకల్‌ క్యాడర్‌ వివరాలను ప్రదర్శిస్తారు.
 • ఆప్షన్ల ఎంపికలో భాగంగా ఉద్యోగులు జిల్లా క్యాడర్‌ పోస్టుకు సంబంధితశాఖ జిల్లా కార్యాలయంలో, జోనల్‌ పోస్టుకు సంబంధిత హెచ్‌వోడీకి, మల్టీజోనల్‌ పోస్టుకు సంబంధితశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి.
 • ఉద్యోగులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఎంచుకోవాలి. లేనిపక్షంలో మార్గదర్శకాల ప్రకారం ఆయా ఉద్యోగిని ఏదైనా జిల్లాకు కేటాయించే అధికారం కమిటీకి ఉంటుంది.
 • ఉద్యోగుల కేటాయింపు కమిటీలు సంబంధిత దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల ప్రకారం కేటాయిస్తారు. కేటాయింపు జాబితాను ప్రతి లోకల్‌ క్యాడర్‌కు సిద్ధం చేయాలి. కేటాయించిన పోస్టులకన్నా అత్యధికులు ఆప్షన్లు ఎంచుకొంటే సీనియార్టీ ప్రకారం కేటాయిస్తారు.
 • ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టుల నిష్పత్తికి అనుగుణంగా విభజన జరుగుతుంది.
 • సీనియార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపు కోరవచ్చు. 70శాతానికిపైగా వైకల్యం ఉన్నవారు, కుటుంబంలో మానసిక వికలాంగులైన పిల్లలున్నవారు, కారుణ్య నియామకాల్లో భాగంగా నియమితులైన వితంతువులు, మెడికల్‌ గ్రౌండ్స్‌లో క్యాన్సర్‌, న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, ఓపెన్‌హార్ట్‌ సర్జరీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్యాటగిరీ కింద కేటాయింపు కోరేవారు సంబంధిత సర్టిఫికెట్లను జతచేయాలి.
 • భార్యభర్తల కేసులుంటే ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన తర్వాత పరిష్కరిస్తారు. దరఖాస్తు చేసుకొంటే ఖాళీల లభ్యతను బట్టి కేటాయింపులో మార్పులు చేస్తారు. దంపతులైన ఉద్యోగులను వీలైనంతవరకు ఒకే లోకల్‌ క్యాడర్‌లో ఉండేలా చూస్తారు.
 • ఉద్యోగుల విభజన, కేటాయింపు సమయంలో టీజీవో, టీఎన్జీవోలతో పాటు, ఇతర గుర్తింపు పొందిన సంఘాలకు చెందిన ఒక సభ్యుడిని ఆహ్వానిస్తారు.
 • కేటాయింపు ప్రక్రియతో పాటు, ఉత్తర్వులు సులభంగా జారీచేసేందుకు ఉద్యోగులు కేటాయింపు కమిటీలకు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ యాక్సెస్‌ ఇస్తారు. ఈ పోర్టల్‌ ద్వారా ఆర్డర్లను జారీచేస్తారు.
 • స్పెషల్‌ సీఎస్‌, ముఖ్య కార్యదర్శి, సెక్రటరీ, హెచ్‌వోడీలు, లేదా అపాయింటింగ్‌ ఆథారిటీలు సందర్భానుసారంగా కేటాయింపుల ఉత్తర్వులు జారీచేస్తారు.
 • ఎవరైనా ఉద్యోగి కేటాయింపు పట్ల అసంతృప్తిగా ఉంటే ఆ శాఖ కార్యదర్శికి వినతిపత్రాన్ని సమర్పించవచ్చు. దీన్ని స్వీకరించిన తర్వాత సక్రమమైతే పరిగణనలోకి తీసుకోవచ్చు/తిరస్కరించవచ్చు.
 • పరిపాలన అవసరాల దృష్ట్యా ఏ ఉద్యోగినైనా, ఎక్కడైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నది.
 • అసాధారణ పరిస్థితుల్లో, పరిపాలన అవసరాల ప్రయోజనాల కోసం పైమార్గదర్శకాలను సడలిస్తారు. ఈ నిబంధనలను సడలించి ఉద్యోగిని కేటాయించే అధికారం పూర్తిగా ప్రభుత్వానిదే.

ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల విభజన, కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేయడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు. సచివాలయంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ను టీఎన్జీవో నేతలు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌, జగదీశ్వర్‌ కలిసి ధన్యవాదాలు తెలిపారు.

జిల్లాస్థాయి పోస్టులకు
జిల్లాస్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ ఉద్యోగులను కేటాయించనున్నది. ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా, సంబంధితశాఖల జిల్లా హెచ్‌వోడీలు సభ్యులుగా ఉంటారు.
జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులకు
జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తారు. సంబంధిత శాఖల స్పెషల్‌ సీఎస్‌/ ముఖ్యకార్యదర్శి/ కార్యదర్శి/ హెచ్‌వోడీ, ఆర్థికశాఖ సీనియర్‌ కన్సల్టెంట్‌, ప్రభుత్వం నిర్ణయించిన ఇతర సీనియర్‌ అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఉద్యోగుల మదిలో చిరకాలం సీఎం కేసీఆర్‌
ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు విడుదల చేయటం హర్షణీయం. 33 జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 95 శాతం ఉద్యోగాలు దక్కేలా కొత్త జోన్లు, జిల్లాలను అమల్లోకి తీసుకురావటం సంతోషకరం. 33 జిల్లాల్లోని ఉద్యోగులకు భారీ ఉపశమనం కలగనున్నది. ఏ జిల్లా ఉద్యోగి ఆ జిల్లాలోనే పనిచేసేలా మార్గదర్శకాలు ఇవ్వటం ద్వారా ఉద్యోగుల మదిలో సీఎం కేసీఆర్‌ చిరకాలం ఉంటారు.

 • మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు

ఆమోదయోగ్య మార్గదర్శకాలు
ఉద్యోగుల కేటాయింపు కష్టమైన పని. రాష్ట్ర విభజన సమయంలోనూ కమలనాథన్‌ కమిటీ కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెట్టింది. కానీ ఇప్పుడు జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగులకు కేటాయింపు సందర్భంగా ఉద్యోగులెవరూ నష్టపోకుండా, సీనియార్టీ ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలిచ్చారు. ఉద్యోగులకు మంచి చేయాలని, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాలను జారీచేశారు. ఉద్యోగులకు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారు.

 • వీ మమత, టీజీవో అధ్యక్షురాలు

బదిలీలు,పదోన్నతులకు ఆస్కారం
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు సంతృప్తికరంగా ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు సులభతరం కానున్నది. ఆర్డర్‌ టూ సర్వ్‌ విధానంలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ పోస్టుల్లో కేటాయిస్తారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కొత్త జిల్లాతో పాటు, పాత జిల్లాల్లోనూ ఆప్షన్‌ ఇచ్చుకొనే అవకాశమివ్వటం స్వాగతించాల్సిన అంశం.

 • మారెడ్డి అంజిరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

సీనియార్టీని కాపాడటం హర్షణీయం
ఉద్యోగుల సీనియార్టీని కాపాడుతూ విభజన చేపట్టేందుకు మార్గదర్శకాలివ్వటం హర్షణీయం. పాత జిల్లాల్లోని ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకొన్నారు. ఉద్యోగుల విభజన పూర్తయితే కొత్త నోటిఫికేషన్లకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కుతాయి.

 • ఎం చంద్రశేఖర్‌గౌడ్‌, తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement