అమరావతి : తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) అక్టోబర్ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం (Angapradakshinam), శ్రీవాణి టికెట్ల (Srivani Tickets) ను మంగళవారం విడుదల చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తుంది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన (Special Darsan) టికెట్లు అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ (Online) లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala) కు తరలివస్తుండడంతో 17 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8-12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 71,939 మంది భక్తులు దర్శించుకోగా 26,327 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.90 కోట్లు వచ్చిందన్నారు.