ఉప్పల్, మార్చి 30: యాదాద్రి కొండపైకి మినీబస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. బుధవారం వీటిని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 83 బస్సులు, 153 ట్రిప్పులు నడుపుతున్నట్టు చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8.25 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉప్పల్ నుంచి రూ.75, జేబీఎస్ నుంచి రూ.100 వసూలు చేస్తారని వెల్లడించారు. నరసింహస్వామిని కొలుస్తున్నట్టు అనిపించేలా మినీ బస్సులను ప్రత్యేక డిజైన్‌తో తయారు చేశామని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి యాదాద్రికి ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను నడుపుతామని చెప్పారు. భక్తులు ఆర్టీసీలో ప్రయాణించి, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని, ప్రజలు ఆర్టీసీకి సహకారం అందించాలని సజ్జనార్ కోరారు. యాదాద్రి గుట్టపైకి వెళ్లే భక్తులకు ఉప్పల్ నుంచి ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, నేతలు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, పిట్టల నరేష్ ముదిరాజ్, పల్లె నర్సింగ్‌రావు పాల్గొన్నారు.