
పీఎంఎస్వైఏ నిధి కింద 34 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలిచ్చి లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మిగతా రాష్ర్టాలన్నింటికి తెలంగాణ స్ఫూర్తిదాయకం అంటూ కేంద్ర పట్టణ గృహనిర్మాణ మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా చేసిన ట్వీట్‌ను చూపిస్తున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవటంలేదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. గత ఏడున్నరేండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో ప్రధానమంత్రికి, మంత్రులకు లెక్కలేనన్ని విజ్ఞాపనలు ఇచ్చారని, అవన్నీ బుట్టదాఖలయ్యాయని తెలిపారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన పనుల్లో కేంద్రం ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రోడ్ల విస్తరణ కోసం రక్షణశాఖ భూములివ్వాలని కోరితే ఇప్పటివరకూ స్పందనేలేదని విమర్శించారు. నగరంలో రక్షణశాఖ అధికారులు ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తూ సమాంతర వ్యవస్థను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం వెంటపడి, వేధించి రాష్ట్ర హక్కులు సాధిస్తామని ప్రకటించారు. పెండింగ్ పనులను సాధించేవరకు కేంద్రాన్ని వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల మనవిని వినకపోతే కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూనే ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు, ప్రశంసలు ఇస్తున్నదికానీ.. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా ఇవ్వడంలేదని విమర్శించారు.
గత ఏడున్నరేండ్లలో రాష్ర్టానికి సంబంధించిన ఎన్నో అంశాలను కేంద్రానికి విన్నవించామని, వాటిలో అత్యధికం పెండింగ్‌లోనే ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా వెంటబడి, వేటాడి, వెంబడించి అన్నింటినీ సాధించుకొంటామని చెప్పారు. ‘ప్రజల మాట వినకపోతే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నది. నిన్న వరి కొనుగోళ్లపై రోడ్డెక్కాం, నిరసన తెలిపాం. ప్రజల దృష్టికి తీసుకొనిపోయాం. హైదరాబాద్ విషయంలో పదుల సంఖ్యలో మా విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసింది. వాటిని ఒక్కొక్కటిగా తీసి ప్రజల ముందు పెడుతాం. రాష్ర్టానికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవే వస్తున్నాయి కానీ, అదనంగా ఒక్కపైసా రావటం లేదు. బెంగళూరులో మెట్రోకు రూ.17 వేల కోట్లు ఇచ్చారు. మనకు మాత్రం పైసా ఇవ్వలేదు. ఇలా అనేకం ఉన్నాయి’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రక్షణశాఖ భూములపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని, రక్షణ మంత్రిని అడిగి లేఖలు రాసినా స్పందన లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘వాళ్లు రోడ్లు ఇయ్యదలుచుకోలేదు. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు రోడ్డు భయకరంగా మారింది. ప్యాట్నీ నుంచి కొంపల్లి పోవాలంటే దారుణంగా ట్రాఫిక్ ఉన్నది. లంగర్‌హౌజ్‌లో బంజారాహిల్స్ నుంచి హుస్సేన్‌సాగర్ వచ్చే నాలా మిలిటరీ ఏరియా నుంచి వస్తున్నది. నాలా మీద ఓ చెక్ డ్యాం కట్టారు. దాని ద్వారా పైనున్న శాకం చెరువు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని తీసేయండి అంటే తియ్యడంలేదు. వాళ్లేదో ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో భాగం కానట్టుగా రక్షణశాఖ అధికారుల వైఖరి ఉన్నది. వాళ్ల ఇష్టానుసారం రోడ్లను మూసేస్తారు. ఇలా అనేకమున్నాయి. మనది కొత్త రాష్ట్రం, పద్ధతి ప్రకారం నడవాలని ఇన్నాళ్లూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాం. వాళ్లు వినకుంటే ప్రజలపక్షాన నిరసన తెలుపుతాం’ అని కేటీఆర్ చెప్పారు.
పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం- 2019, పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. పట్టణ ప్రగతి ప్రారంభమైన నాటి పట్టణ స్థానిక సంస్థలకు రూ.2,959 కోట్లు విడుదల చేశామని వివరించారు. పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, ఎల్ఈడీ వీధి దీపాలు, వైకుంఠ దామాలు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుచేస్తున్నామని, అర్బన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా 4,800 పైగా స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశామని, డంపింగ్ యార్డులు, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. ప్రజల కేంద్రంగా పౌర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో 101 పట్టణాలు ఓడీఎఫ్ ప్లస్ విభాగంలో, 8 పట్టణాలు ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్, గ్రేటర్ హైదరాబాద్ వాటర్ ప్లస్ సిటీగా గుర్తింపు పొందాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పీఎం స్వనిధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా కూడా అభినందించారని, ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గతంలో 8,500 ప్రజా మరుగుదోడ్లు ఉంటే, పట్టణ ప్రగతిలో కొత్తగా 9,088 నిర్మించామని తెలిపారు. మున్సిపల్‌శాఖకు గతంలోనూ అనేక అవార్డులు వచ్చాయని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఏకకాలంలో అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని వెల్లడించారు.
కేంద్రం తెలంగాణకు అవార్డులు ఇస్తున్నదికానీ పథకాలకు నిధులివ్వటంలేదని కేటీఆర్ విమర్శించారు. పథకాలకోసం కేంద్ర సహకారాన్ని కొరుతామని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా డబుల్ బెడ్ ఇండ్లకోసం రూ.18 వేలకోట్లు ఖర్చుచేస్తున్నామని, పట్టణాల్లో ఒక్కో ఇంటిపై రూ.9 లక్షలు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఒక డబుల్బెడ్రూం ఇంటికి గతంలో ఇచ్చిన 10 ఇందిరమ్మ ఇండ్లు సమానమని తెలిపారు. మున్సిపాలిటీలకు నిధుల కొరత లేకుండా ప్రతినెలా విడుదల చేస్తున్నామని, టీయూఎఫ్ఐడీసీ ద్వారా పట్టణాలకు రూ.3 వేల కోట్లు కేటాయించామని వివరించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్ ఎంతో మెరుగ్గా ఉన్నదని, ఇక్కడ అతి తక్కువ వైశాల్యంలో ఎక్కువ జనాభా నివసిస్తున్నదని చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం ఎస్ఎన్డీపీ ద్వారా రూ.858 కోట్లు ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. సండే ఫన్ డే, చార్మినార్ వద్ద ఉత్సవాలు, మెట్రో రైళ్లను ఉదయం 6 గంటలకే ప్రారంభించడం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజాభిప్రాయాల ఆధారంగా చేపట్టామని పేర్కొన్నారు. పాత బస్తీ అభివృద్ధిపై ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. జీవో 111పై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
కేంద్రప్రభుత్వం నిర్వహించిన శానిటేషన్ చాలెంజ్‌లో తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 4,300 పట్టణాలు పోటీ పడగా 12 అవార్డులు రాష్ర్టానికే దక్కటం గొప్పవిషయమని చెప్పారు. పట్టణాభివృద్ధిశాఖ కృషికి లభించిన గుర్తింపుగా ఈ అవార్డులను భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 20న ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేస్తారని వివరించారు. అవార్డులు సాధించిన పాలకవర్గాలకు, అధికారులకు అభినందనలు తెలిపారు. అవార్డులు సాధించడంలో విశేష కృషిచేసిన అరవింద్ కుమార్, ఎన్ సత్యనారాయణ, లోకేశ్కుమార్ను అభినందించారు.
