న్యూఢిల్లీ : భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన దేశీయంగా రాజకీయ దుమారం లేపింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందన్న వాస్తవాన్ని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్ప ప్రతి ఒక్కరూ గుర్తించారన్నారు. దేశ ఆర్థిక పునాదులను పద్ధతి ప్రకారం బీజేపీ ప్రభుత్వం బలహీనపరుస్తున్నదన్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘వైట్‌హౌస్‌లోని ఒక బఫూన్-ఇన్-చీఫ్ మన పరిపాలక యంత్రాంగాన్ని బెదిరించడం చూస్తే బాధగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రకటన ‘56 అంగుళాల ఛాతీ’ ఇచ్చిన హమీ అనుకోవాలా లేదా సుంకాలు 56 శాతానికి చేరుకొనే వరకు దేశం నిరీక్షించాలా అని ఆయన ప్రధాని మౌనాన్ని ప్రశ్నించారు.
ట్రంప్ చర్యలు మన దేశ సార్వభౌమత్వం, ఆర్థిక విధానంపై స్పష్టమైన దాడి అని విమర్శించారు. ట్రంప్ ప్రకటించిన సుంకాలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, తయారీ రంగం, ఐటీ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు, చివరికి మన రైతులపైనా ప్రభావం చూపిస్తాయని అన్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లు కూడా బీజేపీ సర్కారు విదేశాంగ విధానాన్ని విమర్శించారు. ప్రజా సంబంధాల కన్నా జాతి ప్రయోజనాలకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని ఖర్గే సూచించారు. ట్రంప్ ప్రకటించిన సుంకాలు, జరిమానాలు భారత్-అమెరికా వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు విధిస్తుంటే ప్రధాని అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాల సమర్థత ఏమైందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కేంద్రం ట్రంప్‌ను స్నేహితుడిగా భావిస్తే.. ఆయన మన దేశాన్ని చెంప దెబ్బ కొట్టారని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా అన్నారు.