వాషింగ్టన్, ఏప్రిల్ 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై వెనక్కు తగ్గేది లేదని పునరుద్ఘాటించారు. చైనాతోసహా ఏ దేశానికి తన వాణిజ్య సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని ఆదివారం ఆయన స్పష్టం చేశారు. కొన్ని టెక్ ఉత్పత్తులపై తన ప్రభుత్వం సుంకాల మినహాయింపులు ఇచ్చినట్టు వస్తున్న వార్తలను సోషల్ మీడియా వేదికగా ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికాను అత్యంత హీనంగా చూస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలకు పాల్పడుతున్న దేశాలు ప్రత్యేకంగా చైనాను తమ చిట్టా నుంచి తప్పించే ప్రసక్తి లేదని ఆయన ప్రకటించారు.
అమెరికాకు షాకిచ్చిన చైనా..
అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటో తయారీ, ఏరోస్పేస్ తయారీదారులు, సెమికండక్టర్ కంపెనీలు, అనేక వినిమయ వస్తువుల తయారీలో అమెరికా కంపెనీలు ప్రధానంగా ఉపయోగించే ముడి పదార్థాలు, మ్యాగ్నెట్లు, ఖనిజాల సరఫరాను చైనా నిలిపివేసింది. కార్ల నుంచి క్షిపణుల వరకు అన్ని వస్తువుల తయారీలో కీలకంగా ఉపయోగించే మ్యాగ్నెట్ల ఎగుమతిని చైనా నిలిపివేసింది.