హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ విధించిన మూలధన వ్యయం లక్ష్యాలను తెలంగా ణ అందుకున్నది. తద్వారా అదనపు రు ణం పొందేందుకు అర్హత సాధించింది. సాధారణంగా ప్రభుత్వాలు ఆస్తులను సృష్టించేందుకు చేసే ఖర్చును మూలధన వ్యయంగా పేర్కొంటారు. ఇది భవిష్యత్తులో ఆదాయ వనరులు పెరిగేందుకు దోహదపడి, తద్వారా ఆయా రాష్ర్టాల ఆర్థికవృద్ధికి తోడ్పడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిర్దేశించిన లక్ష్యాలను దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాలు మాత్రమే సాధించాయి. ఇందులో తెలంగాణ ఒకటి. దీంతో ఈ ఏడు రాష్ర్టాలకు ఎఫ్ఆర్బీఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతిచ్చింది. ఇది ఆయా రాష్ర్టాల జీఎస్డీపీలో 0.5 శాతంగా కేంద్రం పేర్కొన్నది. ఇందులో అత్యధికంగా తెలంగాణకు రూ.5,392 కోట్లు పొందేందుకు అర్హత లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ (రూ.2,869 కోట్లు), రాజస్థాన్ (రూ.2,593 కోట్లు) నిలిచాయి. వీటితోపాటు ఛత్తీస్గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయకు సైతం అదనపు రుణం పొందేందకు కేంద్రం అనుమతించింది. కేంద్రం విధించిన లక్ష్యాలను సాధించలేకపోయిన రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా నిలిచింది. దీంతో ఆ రాష్ట్రం అదనపు రుణాన్ని పొందే అర్హత కోల్పోయినట్టు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.