హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): యాసంగి వరి సాగు, ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌ను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం కోరింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు మంత్రుల బృందం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు బీబీపాటిల్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, జోగురామన్న తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం మంత్రి గంగుల కమలాకర్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు మెమొరాండం ఇచ్చామన్నారు. ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన అంశాలు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. ప్రతి సీజన్‌కు ముందే ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో చెప్పాలన్నాం.
గత యాసంగిలో మాట ఇచ్చి, కొనుగోలు చేయనటువంటి బియ్యాన్ని తీసుకోవాలన్నాం’ అని వివరించారు. నెత్తిన సీజన్ పెట్టి …అప్పటికప్పుడే తేల్చకుంటే…రైతులకు శరాఘాతం అవుతుందని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని మెమొరాండంలో పేర్కొన్నామన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్.. రైతాంగ అంశాలను తప్పకుండా పరిష్కరిస్తాం. ఈ రాష్ట్రం బాగుంది. ఇంకా బాగుండాలి. రైతాంగ అంశాలు కాబట్టి.. ఎలాంటి గందరగోళానికి అవకాశాలు ఉండొద్దని కోరుకొంటున్నట్టు గవర్నర్ చెప్పినట్టు తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను యథాతథంగా పంపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మెమొరాండం స్వీకరించి, విజ్ఞప్తులను విన్నందుకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.