హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తేతెలంగాణ): వానకాలంలో మొత్తం ధాన్యాన్ని కొనటంతో పాటు, రాబోయే యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం కొంటుందో, లేదో చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఎంత దిగుబడి వస్తే, అంతా కొంటామని కేంద్రం రాతపూర్వకంగా చెప్పాలని అడిగారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్‌సభా పక్ష నేత నామానాగేశ్వర్‌రావు, ఇతర ఎంపీలతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
‘కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే తెలంగాణకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. మొత్తం బియ్యం కొంటామని కేంద్రమంత్రి నోటి మాటతో చెప్పారు సరే, తర్వాత కొనబోం అని చేతులెత్తేస్తే మా పరిస్థితేంటి? అందుకే లిఖితపూర్వకంగా చెప్పాలని అడుగుతున్నాం. రైతుల ప్రయోజనాల కోసమే మేం ఢిల్లీకి వచ్చాం. రాజకీయం చేయటానికి కాదు. కేంద్రమంత్రి తక్షణమే మాకు సమయం ఇవ్వాలి. మా రైతుల గోడు వినాలి. మమ్మల్ని నిరీక్షించేలా చేయటం అంటే తెలంగాణ రైతులను అవమానించినట్టే. ఆయన టైం ఇచ్చేవరకు వేచిచూస్తాం’ అని నిరంజన్ రెడ్డి అన్నారు.
వానకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చిందని, ఇప్పటికే 60 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉన్నదని వెల్లడించారు. భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వరి కోతలే జరగలేదని, జనవరి 15 వరకు వరి కోతలు కొనసాగుతాయని వివరించారు. 40 లక్షల టన్నుల బియ్యం/60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు కేంద్రంతో రాష్ర్టానికి ఎంవోయూ కుదిరిందని, దాన్ని పెంచాలని గతంలోనే రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించారని గుర్తుచేశారు.
ఇంకా వేచి చూస్తున్నాం
శనివారం సాయంత్రం నుంచి ఢిల్లీలో తెలంగాణ రైతాంగం పక్షాన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి వేచి ఉన్నామని నిరంజన్ రెడ్డి చెప్పారు. కేంద్రమంత్రి రెండు రోజులుగా ముంబైలో ఉన్నారని ఆయన కార్యాలయ సిబ్బంది చెప్తున్నారని, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు ఫోన్లో ఆయనను సంప్రదించి తెలంగాణ మంత్రులు, ఎంపీలు కలవడానికి వేచిచూస్తున్నట్టు సమాచారం ఇచ్చారని తెలిపారు. తమకు 5 నిమిషాల టైం ఇస్తే సరిపోతుందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇష్టమున్నప్పుడే సమయం ఇస్తాం, అప్పుడు రండి.. ఇప్పుడు రండి అన్న ధోరణి ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని, కేంద్ర పెద్దలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతుల కోసం ఎంతకైనా ఓర్చుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీకి రావడానికి ముందే పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోరామని వెల్లడించారు.
అయోమయంలో కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయోమయంలో ఉన్నారని, అందుకే వానకాలం ధాన్యం కొనుగోళ్లతో యాసంగిని ముడిపెడుతూ మాట్లాడుతున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇతర దేశాలకు ఎగుమతిపై రాష్ర్టాలకు అధికారం ఉండదని, దీనిపై కూడా కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. గోదాములు ఖాళీ లేవని ఎఫ్‌సీఐ అధికారులే చెప్తున్నారని, తెలంగాణలో 10 లక్షల మిల్లింగ్ కెపాసిటీ ఉన్నదని వివరించారు. మిల్లింగ్ చేసిన బియ్యం రెడీగా ఉన్నా వాటిని తీసుకెళ్లటం లేదని, కానీ రాష్ట్రమే బియ్యం ఇవ్వటం లేదని కిషన్‌రెడ్డి నెపం వేస్తున్నారని విమర్శించారు.
పీయూష్ గోయల్ నిర్లక్ష్య వైఖరి
ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతనివ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల పట్ల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మంత్రిని కలవడానికి వేచి ఉన్నామని సమయం కోరగా దాటవేత ధోరణి ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నలుగురు మంత్రుల బృందం వచ్చిందని, ధాన్యం సేకరణ విషయంపై చర్చించేందుకు సమయం కేటాయించాలని కేంద్రమంత్రిని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. సమయం కుదిరితే మధ్యాహ్నం కలుస్తానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ముందుగా మధ్యాహ్నం కలుస్తానని సమాచారమిచ్చిన పీయూష్ గోయల్ ఆ తర్వాత మాట మార్చి అవమానించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పీయూష్ గోయల్‌ను పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు సమయం కోరారు. దీంతో ఇవాళ కలవటం కుదరదు.. మంగళవారం మధ్యాహ్నం 2.30కి కలుద్దామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి:
రా బియ్యం ఎంతైనా కొంటామని ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లోనే ప్రకటించారు కదా! వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
నోటి మాట చెప్పడం వేరు. లిఖిత పూర్వకంగా చెప్పడం వేరు. ధాన్యం సేకరించాక రైతులకు 3, 4 రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రాత పూర్వకంగా హామీ ఇవ్వని కేంద్రం, తర్వాత మాట మారిస్తే పరిస్థితేంటి? ఇప్పటికే కేంద్రంతో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. నోటి మాటతో చెల్లుబాటు కాదు. ఎంత తీసుకుంటారో రాతపూర్వకంగా చెప్పాలి.
కేంద్రానిదే ఆ బాధ్యత
వానకాలం వడ్ల కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన హామీని లిఖిత పూర్వకంగా ఇవ్వాలి. ఈ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని కేంద్రాన్ని కోరాం. కానీ 60 లక్షల టార్గెట్ పూర్తి చేసి రమ్మంటున్నది. రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి దృష్ట్యా 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిందే. బియ్యం మిల్లింగ్ తర్వాత తరలించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కిషన్‌రెడ్డి గత యాసంగి గురించి మాట్లాడుతూ గందరగోళపరుస్తున్నారు.
కేంద్రాన్ని నిలదీస్తాం
ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఢిల్లీలో నిలదీస్తాం. తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనాలని ఢిల్లీలో కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటి వరకు మాకు స్పష్టత లేదు. రైతుల విషయంలో పార్లమెంట్ లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలం చిత్తశుద్ధితో పోరాడాం. భవిష్యత్తులోనూ పోరాడుతాం. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన పట్ల కేంద్రం, బీజేపీ ఎంపీలు అమానుషంగా, అమర్యాదకరంగా మాట్లాడుతున్నారు. పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రులే అబద్ధాలు చెప్తున్నారు.