హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు.. తెలంగాణను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. బుధవారం నిర్వహించే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీ ఏర్పాట్లను తలసాని సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిందని, రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పారు. పోరాడి సాధించుకొన్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఊరకుక్కల్లా మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ అత్యంతబలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని మంత్రి తలసాని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తృత కార్యకర్తల బలం ఉన్న పార్టీగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. 2014, 2018 ఎన్నికల్లో లాగానే భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేసి మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు.
ఈ నెల 27న జరుగనున్న పార్టీ ఆవిర్భావ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశ రాజకీయాలపై, ప్రజల కష్టసుఖాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉన్నదని మంత్రి తలసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.