e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News లోన కసి లోగోకు బసి

లోన కసి లోగోకు బసి

  • బీజేపీ అధిష్టానంపై రగిలిపోతున్న కార్పొరేటర్లు
  • ఏడాది దాటినా ఫ్లోర్‌లీడర్‌ ఎంపిక ఊసెత్తని బీజేపీ అధిష్ఠానం
  • అంతర్గత అసంతృప్తితోనే విధ్వంస కాండగా మారిన నిరసన
  • వర్గాలుగా చీలిపోయి, పోటీపడి మరీ రణరంగం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్లు
  • బీజేపీ కార్యాలయ ప్రెస్‌మీట్‌కూ ఆశావహులే హాజరు

గ్రేటర్‌ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. ఎవరికివారే అన్నట్లు వర్గాలుగా విడిపోయి కార్పొరేటర్లు చేసిన అరాచకం ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చింది. బల్దియా వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన కార్పొరేటర్లే కార్యాలయంపై తెగబడి విధ్వంసం చేయడం ప్రజలను నివ్వెరపరిచింది. లోపల పార్టీ అధిష్టానంపై రగిలిపోతూ ద్వేషాన్ని జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై చూపించారు. బల్దియా ఫ్లోర్‌లీడర్‌ పదవి కోసం పోటీపడుతున్న పలువురు కార్పొరేటర్లు వర్గాలుగా చీలిపోయి పోటీపడి మరీ విధ్వంసకాండను సృష్టించారు. కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగి ఏడాది దాటినా పార్టీ ఫ్లోర్‌లీడర్‌ను ఎంపిక చేయడంలో అధిష్టానం తాత్సారం ప్రదర్శిస్తుందని కార్పొరేటర్లు రగిలిపోతున్నారు. ఈ పదవి కోసం వర్గాలుగా చీలిపోయినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీలోనే పాత-కొత్త వర్గాలు ఉండటంతో ఆశావహులు కూడా విడిపోయారు. కనీసం గ్రేటర్‌ సర్వసభ్య సమావేశమైనా నిర్వహిస్తే ఫ్లోర్‌లీడర్‌ పదవి అంశం కొలిక్కి వస్తుందని భావించి విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తున్నది.

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌ బీజేపీలో తమ అధిష్ఠానంపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాల ఒక్కసారిగా భగ్గుమంది. గ్రేటర్‌ ఎన్నికలు జరిగి ఏడాది దాటినా ఇప్పటివరకు ఫ్లోర్‌లీడర్‌ ఎంపిక చేపట్టకపోవడంతో అధిష్ఠానంపై కార్పొరేటర్లు భగ్గుమంటున్నారు. కొంతకాలంగా పార్టీలోని ఈ కుంపటి రెండు రోజుల కిందట పార్టీ కార్యాలయ గడప దాటి గ్రేటర్‌ ప్రధాన కార్యాలయాన్ని అంటుకుంది. ఫ్లోర్‌లీడర్‌ పదవి కోసం పోటీపడుతున్న పలువురు కార్పొరేటర్లు వర్గాలుగా చీలిపోయి పోటీపడి మరీ విధ్వంస కాండను సృష్టించారు.

- Advertisement -

ఇదేందీ.. ప్రజా సమస్యలు, గ్రేటర్‌ సర్వసభ్య సమావేశం ఎజెండాగా బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు కదా అనుకుంటున్నారా?! అదంతా పైకి చెప్పే మాటలేనని పార్టీవర్గాలే చెబుతున్నాయి. నిజానికి బీజేపీ అధిష్ఠానం ఫ్లోర్‌లీడర్‌ పదవిని భర్తీ చేయకపోవడంతో ఆ పదవి కోసం పోటీపడుతున్న పార్టీ ఆశావహ కార్పొరేటర్లు పక్కా స్కెచ్‌తో వీరంగాన్ని సృష్టించారని స్పష్టం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్‌ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా కుంపటి రేపిన ఫ్లోర్‌లీడర్‌ పదవిని అధిష్ఠానం దృష్టికి తీసుకుపోవాలనే కసి చివరకు నిరసన కార్యక్రమాన్ని దారి తప్పేలా చేసిందంటున్నారు. గ్రేటర్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇలాంటి విధ్వంసాన్ని సృష్టించి పార్టీకి మచ్చ తెచ్చారంటూ పార్టీ కార్పొరేటర్లే కొందరు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే బుధవారం గ్రేటర్‌ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌ మీట్‌కు కేవలం ఎనిమిది మంది కార్పొరేటర్లు అందునా ఆశావహులే హాజరయ్యారనే ప్రచారం జరుగుతుంది.

అన్నీ తెలిసినా.. కావాలనే..
గత ఏడాది డిసెంబర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి 11న కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కాలానుగుణంగా జూన్‌లో గ్రేటర్‌ సర్వసభ్య సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. తదనంతరం నాలుగు నెలల్లో గ్రేటర్‌ పరిధిలో 99 రోజుల పాటు వర్షం కురిసింది. ఇందులో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముంపు ప్రాంతాలు, సహాయక చర్యలపైనే తమ దృష్టినంతా కేంద్రీకరించారు. ముఖ్యంగా సహాయక చర్యల్లో భాగంగా గ్రేటర్‌ మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి అనేక డివిజన్లలో పర్యటించారు.

ఈ సందర్భంగా తమ పార్టీ కార్పొరేటరా? ఇతర పార్టీనా? అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ముందస్తు సమాచారం ఇచ్చి వారితో కలిసి పర్యటించారు. సమస్యల పరిష్కారంలోనూ మేయర్‌, అధికారులు రాజకీయాలకు అతీతంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ వాస్తవం బీజేపీ కార్పొరేటర్లకు తెలియనిది కాదు. ఈ క్రమంలో పార్టీపరంగా బీజేపీ కార్పొరేటర్లు రెండుసార్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శాంతియుతంగా తమ డిమాండ్లను వినిపించారు.

కొంతకాలంగా రగిలిపోతున్న కార్పొరేటర్లు
గ్రేటర్‌ ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా ఇప్పటివరకు బీజేపీ జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్‌ ఎంపిక చేపట్టలేదు. గ్రేటర్‌ ఏర్పడిన తర్వాత తొలిసారి కొలువుదీరిన పాలకవర్గంలో బీజేపీ తరపున ఫ్లోర్‌లీడర్‌గా బంగారి ప్రకాశ్‌ వ్యవహరించారు. ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికల తర్వాత కొలువుదీరిన పాలకవర్గంలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా అప్పటి, ప్రస్తుత బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ వ్యవహరించారు. కానీ ప్రస్తుతం అధిష్ఠానం నెలల తరబడి ఈ ప్రక్రియ ఊసే ఎత్తడం లేదు. ఈ పదవి కోసం కార్పొరేటర్లు వర్గాలుగా చీలిపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీలోనే పాత-కొత్త వర్గాలు ఉండటంతో అందుకు అనుగుణంగా ఆశావహులు కూడా విడిపోయారు.

పార్టీలో కొంతకాలంగా వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కనీసం గ్రేటర్‌ సర్వసభ్య సమావేశమైనా నిర్వహిస్తే ఫ్లోర్‌లీడర్‌ పదవి అంశం కొలిక్కి వస్తుందని ఆశావహులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సాధారణ నిరసన కార్యక్రమంగా భావించి అక్కడికి వెళ్లిన పలువురు పార్టీ కార్పొరేటర్లు ఈ విధ్వంస కాండను చూసి విస్మయానికి గురైనట్లుగా వారు తమ అనునాయుల వద్ద వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఫ్లోర్‌లీడర్‌ ఎంపికను పూర్తి చేయడంలేదనే అధిష్ఠానంపై ఉన్న కసి చివరకు దారి తప్పినట్లుగా విశ్లేషిస్తున్నారు. అయితే ఇదంతా ముందస్తు వ్యూహంతోనే వారు చేశారని, లేకపోతే నిరసన కార్యక్రమానికి బ్లాక్‌ స్ప్రే వెంట తీసుకురావడమేందని సహచరుల వద్ద ప్రశ్నిస్తున్నారు.

ఈ విధానం వల్ల తమకే చెడ్డపేరు వస్తుందని, అసలు కార్యాలయంలో ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతం పోతుంది? అని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బుధవారం గ్రేటర్‌ బీజేపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కేవలం ఎనిమిది మంది కార్పొరేటర్లు అందునా ఫ్లోర్‌లీడర్‌ పదవి కోసం పోటీపడుతున్న వారే ప్రధానంగా హాజరయ్యారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement