నార్నూర్, అక్టోబర్ 5 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండ గోండు గూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు చెరువు సమీపం వద్ద నాటు సారా తయారీ స్థావరం పై ఆదివారం దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీ చేసే సామగ్రిలు వెంట తీసుకొచ్చి పాఠశాల ఆవరణ ముందు ధ్వంసం చేశారు. గతంలోని బెల్టు దుకాణాలలో మద్యం విక్రయాలు.. గుడుంబా తయారిని అరికట్టాలని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపించారు.
గుడుంబా తయారీ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాగే పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆదివాసి మహిళలు హెచ్చరించారు. ఈ విషయాన్ని నార్నూర్ ఎస్ఐ అఖిల్ కు సమాచారం ఇవ్వగా గుడుంబా తయారీ స్థావరాలను పరిశీలించారు. వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు.
రాథోడ్ శంకర్, రాథోడ్ దన్ను నాటు సారా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బాధితులపై చట్టారీత్య చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్నట్లు దృష్టికి వస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ బలాన్ పూర్ మాజీ సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, ఆదివాసీ మహిళలు నీలాబాయి, కవిత, అనసూయ, జమున బాయి, రాధా బాయి తదితరులున్నారు.