హైదరాబాద్; ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ) : హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20మందికి గాయాలైన సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రమణ ట్రావెల్స్ బస్సు సోమవరప్పాడు హైవే వద్ద ముందువెళ్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అకడికకడే మృతిచెందగా, మరో 20మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. రోడ్డుపై బస్సు అడ్డంగా పడిపోవడంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయి.. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.