నాగర్ కర్నూల్: పాత్రికేయులకు శిక్షణ తరగతుల వల్ల ( Training classes ) మరింత విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ ( Press Academy Chairman) శ్రీనివాసరెడ్డి ( Srinivas Reddy ) అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని అటవీ శాఖ వనమాలిక వద్ద తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం, అటవీశాఖ సౌజన్యంతో నిర్వహించిన రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో శ్రీనివాసరెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేశారు.
జర్నలిస్టులకు జ్ఞానం పెంపొందించుకునేలా, వివిధ అంశాలతో కూడిన 10 పుస్తకాల కిట్టును ప్రెస్ అకాడమీ తరుఫున అందిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణ తరగతులతో క్వాలిటీ జర్నలిజంపై అవగాహన జ్ఞానం పెరుగుతుందని అన్నారు. స్థానిక సమస్యలను, అవసరాలను ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా వార్తలు రాయడం వల్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్, విశాలాంధ్ర ఎడిటర్ ఆర్ వి రామారావు, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, రాములు, తెలంగాణ మీడియా సిబ్బంది పూర్ణచంద్రరావు, మేనేజర్ శనేశ్వర రెడ్డి, ఓఎస్డీ రెహమాన్, ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ తదితరులు హాజరయ్యారు.