Trade Talks : భారత్-అమెరికా (India-USA) దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Trade agrement) కోసం సోమవారం నుంచి మరో విడత చర్చలు జరుగనున్నాయి. అమెరికా (US) లోని వాషింగ్టన్ (Washington) నగరంలో ఇవాళ చర్చలు మొదలు కానున్నాయి. ఇప్పటికే భారత వాణిజ్య శాఖ అధికారులతో కూడిన ఓ బృందం వాషింగ్టన్కు చేరుకుంది. ఈ టీమ్‌లో చీఫ్ నెగోషియేటర్‌గా వ్యవహరించే వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ (Rajesh Agarwal) మాత్రం బుధవారం తన బృందంతో కలువనున్నారు.
సోమవారం నుంచి నాలుగు రోజులపాటు ఈ వాణిజ్య చర్చలు జరగనున్నాయి. గురువారం ముగియనున్నాయి. వ్యవసాయం, ఆటోమొబైల్ లాంటి రంగాల్లో నెలకొన్న చిక్కు ముడులను తొలగించుకోవడానికి ఇరు దేశాలకు చెందిన బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కూడా అదనపు టారిఫ్‌ల అమలును వాయిదా వేసింది. ఆగస్టు 1 వరకు పలు దేశాలకు గడువు పొడిగించింది.
భారత్ ఈ చర్చల్లో పూర్తిస్థాయి ద్వైపాకిక్ష వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ఆగస్టు 1 నాటికి తొలి విడత డీల్‌ను కుదుర్చుకోవాలని, ఆ తర్వాత కూడా చర్చలను కొనసాగించి పూర్తిస్థాయి ఒప్పందానికి రావాలని ప్రయత్నిస్తోంది. భారత్ వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకు టారీఫ్‌లలో రాయితీలు ఇచ్చేందుకు సుముఖంగా లేదు. మరోవైపు 26 శాతం టారిఫ్‌లను అమెరికా తొలగించాలని బలంగా కోరుతోంది. అలాగే స్టీల్‌పై 50 శాతం, ఆటో సెక్టార్‌పై 25 శాతం పన్ను తొలగించాలని కోరుతోంది.