హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో ఆదిమమానవుడి ఆనవాళ్లు కనిపించాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మూసీ పరిసరాల్లో ఆదివారం జరిపిన పురావస్తు అన్వేషణలో భాగంగా, స్థానిక వీరభద్రాలయ వంశ పారంపర్య అర్చకులు మాడపాటి పరమేశ్వర ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు వెళ్లగా.. ఆలయ ప్రాంగణంలోని రాతి పరుపుపై దాదాపు 15చోట్ల కొత్తరాతి యుగం (4000 సంవత్సరాల) నాటి రాతి గొడ్డళ్లను పదును పెట్టేందుకు నూరిన గాట్లు ఉన్నాయని తెలిపారు.
అవి 15 సెంటిమీటర్ల పొడవు, 3 సెంటిమీటర్ల వెడల్పు, 2 సెంటిమీటర్ల లోతు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మూసీనది ఒడ్డునున్న వీరభద్రాలయం చట్టుపక్కల రాతి చరియల కింద గుహల్లోనూ కొత్త రాతియుగం వారు నివసించారని వెల్లడించారు. ఈ ఆనవాళ్లు హైదరాబాద్ నగర చరిత్రను 6వేల ఏండ్ల పూర్వానికి తీసుకెళ్లుతున్నాయని తెలిపారు. కొత్త రాతియుగపు ఆనవాళ్లు చారిత్రక వివరాలతో పేరు పలకలు ఏర్పాటుచేసి మంచిరేవులను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మున్సిపాలిటీ అ ధికారులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.