న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించింది. అత్యంత అరుదైన ఈ ఖగోళ అద్భుతాన్ని విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఆసక్తిగా పరిశీలించారు. సూర్యుడు, చంద్రుడు మధ్య నుంచి భూమి పయనించడం వల్ల సూర్య కాంతి చంద్రునిపై పడదు. ఫలితంగా చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
సూర్య కిరణాలు పరావర్తనం చెందడంతో చంద్రుడు రాగి ఎరుపు రంగులో (బ్లడ్‌మూన్) కనిపించాడు. చంద్ర గ్రహణం ఆదివారం రాత్రి 9.57 గంటలకు ప్రారంభమైంది. సంపూర్ణ గ్రహణం రాత్రి 11.01 గంటల నుంచి మొదలైంది. భూమి నీడలో చంద్రుడు దాదాపు 82 నిమిషాలు ఉన్నాడు. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు పరిశీలకులకు తగినంత సమయం లభించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో విద్యార్థులు ఆసక్తిగా ఈ గ్రహణాన్ని వీక్షించారు.