న్యూఢిల్లీ: మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. అయితే, బీజేడీ, బీఆర్ఎస్ సహా మొత్తం 18 మంది ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే ఎన్డీయే అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డిపై 439-324 ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇది అన్ని పార్టీల ఎంపీలు తమ పార్టీల విధానాలకు అనుగుణంగా ఓటు వేస్తే, ఇంకా నిర్ణయం తీసుకోని వారి ఓట్లు ఎవరికి వెళ్తాయో పరిగణనలోకి తీసుకోకుండా లెక్కిస్తే వచ్చిన లెక్క.
బీజేడీ నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, అకాలీదళ్, జడ్పీఎం, వీవోటీటీపీ నుంచి ఒక్కొక్కరు, అలాగే ముగ్గురు స్వతంత్ర ఎంపీలు ఇప్పటికీ తమ మద్దతు ఎవరికి అనేది స్పష్టంగా వెల్లడించలేదు. ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 781గా ఉంది, ఇందులో శిబు సోరెన్ మరణంతో సహా ఏడు ఖాళీలు ఉన్నాయి. బీజేడీకి చెందిన సస్మిత్ పాత్ర, బీఆర్ఎస్కు చెందిన కే సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ సరైన సమయంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే, జేపీఎం, వీవోటీటీపీ ఎంపీలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆప్ తమ 10 మంది ఎంపీల మద్దతును జస్టిస్ రెడ్డికి ప్రకటించింది. 11 మంది సభ్యుల వైసీపీ రాధాకృష్ణకు మద్దతు ప్రకటించింది. ఇది రహస్య ఓటింగ్ కాబట్టి, ఇరు పక్షాలు క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్నాయి. ఈ ఎన్నికలను రాజ్యాంగం వర్సెస్ ఆరెస్సెస్-బీజేపీ పోరుగా అభివర్ణిస్తున్న ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని చెప్తూనే ఇతర రాజకీయ కారణాలను ప్రస్తావిస్తూ టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నది. కాంగ్రెస్ లోక్‌సభ విప్ మాణికం ఠాగూర్ ఆదివారం వైసీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మిమ్మల్ని జైలుకు పంపిన టీడీపీ, బీజేపీ అభ్యర్థికి ఓటేస్తారా? లేక రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతున్న జస్టిస్ రెడ్డికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు.
ఫలితం ఎలా ఉన్నా, ఈ పోరులో విజయం సాధించాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. క్రాస్ ఓటింగ్ జరిగి తమకు విజయం లభిస్తుందని ధీమాగా ఉంది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 324 ఓట్లు వచ్చి ఓడిపోయినా.. ఓడిన అభ్యర్థికి లభించిన అత్యధిక ఓట్లు ఇవే అవుతాయి. 2002లో సుశీల్ కుమార్ షిండేకు 305 ఓట్లు లభించాయి. అప్పుడు గెలుపొందిన భైరాన్‌సింగ్ షెకావత్‌కు 454 ఓట్లు వచ్చాయి. ఇది ఇప్పటివరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యంత గట్టి పోటీ.
ఈసారి ఎన్డీయే అభ్యర్థికి 500 ఓట్లు దాటే అవకాశం లేదు. 2022 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తమ ఓట్లు వేయకపోవడంతో జగదీప్ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు వచ్చాయి. ఆయన కంటే ముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం వెంకయ్యనాయుడు 516 ఓట్లు పొందారు. బీజేపీ ఇప్పటికే తన ఎంపీలకు ప్రాధాన్యత ఓటింగ్ విధానంలో ఎలా ఓటు వేయాలో శిక్షణ మొదలుపెట్టింది. అటు, ప్రతిపక్షం సోమవారం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహిస్తున్నది. దీని తరువాత, పార్లమెంట్ అనెక్స్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విందు ఇవ్వనున్నారు. ఓటర్లు తమ ప్రాధాన్యతలను గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్నులను సరఫరా చేస్తుంది. ఓటర్లు తమ బ్యాలెట్ పేపర్‌ను ఈ ప్రత్యేక పెన్నుతో మాత్రమే గుర్తించాలి, వేరే ఏ సాధనాన్ని ఉపయోగించినా చెల్లని ఓటుగా పరిగణిస్తారు.