వాషింగ్టన్: కృత్రిమ మేధ పితామహుడు జెఫ్రీ హింటన్ సంచలన హెచ్చరిక చేశారు. మానవాళికి ఏఐ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందన్నారు. సామాన్యుడు సైతం ఏఐని ఉపయోగించుకుని అణు బాంబును తయారు చేయవచ్చునని చెప్పారు. ఓ సాధారణ వ్యక్తి త్వరలో ఏఐ సహాయంతో జీవాయుధాలను తయారు చేయగలుగుతాడని, అది చాలా భయంకరమని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడం వల్ల కంపెనీలు మునుపెన్నడూ లేనంత లాభాలను ఆర్జిస్తాయని, ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని జెఫ్రీ హింటన్ హెచ్చరించారు. నిరుద్యోగం విపత్కర స్థాయికి పెరుగుతుందన్నారు. సంపన్నులు తమ పనులు చేయించుకోవడం కోసం ఉద్యోగులు, కార్మికులకు బదులుగా ఏఐని వాడుకుంటారని చెప్పారు. మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకున్ అభిప్రాయం వేరొకలా ఉంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పరిమితంగా ఉన్నాయని, భౌతిక ప్రపంచంతో అర్థవంతంగా వ్యవహరించజాలవని తెలిపారు.