SUV Car Sales | రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ.. ప్రజల ఆశలు.. ఆకాంక్షల్లో మార్పులొస్తున్నాయి. ఆదాయం పెరిగిన ప్రతి ఒక్కరూ సొంతిల్లు సాకారం చేసుకోవడానికి మొగ్గుచూపుతారు.. అటుపై సొంత కారు కొనుగోలు చేయడానికి ప్రియారిటీ ఇస్తుంటారు. గతంలో హ్యాచ్‌బ్యాక్ కార్లు కొనుగోలుదారులకు ఫస్ట్ చాయిస్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు వారి మనోగతం మారుతున్నది. గత ఐదేండ్లుగా ఎస్యూవీ మోడల్ కార్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు తమ పాత మోడల్ కార్లకు ముస్తాబు చేసి విపణిలోకి తెచ్చేందుకు ప్లాన్లు రూపొందించాయి. ఇక ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ సబ్-కంపాక్ట్ ఎస్యూవీ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య పలుకుతున్నది. హ్యాచ్‌బ్యాక్ కారు అదే ధరకు లభిస్తున్నా.. ప్రజలు ఎస్యూవీకే ఓటేస్తున్నారు. గతేడాది ప్రజలు అత్యధికంగా కొనుగోలు చేసిన కార్ల గురించి తెలుసుకుందాం..
2021లో జరిగిన కార్ల విక్రయాల్లో హ్యుండాయ్ క్రెటా టాప్. 2020లో 96,989 యూనిట్లు అమ్ముడైన క్రెటాను 2021లో 1,25,437 మంది సొంతం చేసుకున్నారు. 2020తో పోలిస్తే 29.3 శాతం గ్రోత్ రికార్డయింది. క్రెటాకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకున్న హ్యుండాయ్.. 2020 ప్రారంభంలో సెకండ్ జనరేషన్ క్రెటా కారు తీసుకొచ్చింది. మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎంటరైన కియా మోటార్స్ సెల్టోస్తో పోటీ పడేందుకు దోహద పడింది. కొన్నేండ్లుగా ఎస్యూవీ కార్ల సేల్స్‌లో తరుచుగా క్రెటా టాప్ పొజిషన్లో నిలుస్తున్నది.
క్రెటా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ మోడల్ మారుతి సుజుకికి చెందిన విటారా బ్రెజా. 2020లో 83,666 యూనిట్లు సేలయితే, 2021లో 1,15,962 కార్లు విక్రయించింది. ఏడాదిలో 38.6 శాతం వృద్ధి రికార్డు చేసింది. అయినా క్రెటాతో పోటీ పడేందుకు న్యూ అప్డేట్స్తో ఈ ఏడాది మధ్యలో న్యూ జనరేషన్ బ్రెజాను తెచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధం అవుతున్నది.
ఎస్యూవీ మోడల్ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ నెక్సాన్ది మూడో స్థానం. 2021లో తొలిసారి లక్షకు పైగా కార్లను విక్రయించింది. 2020తో పోలిస్తే 122 శాతం పురోగతి సాధించింది. హ్యుండాయ్ వెన్యూ 2020తో పోలిస్తే 82,428 యూనిట్ల నుంచి 1,08,007 కార్లు అమ్ముడయ్యాయి. 2020తో పోలిస్తే గతేడాది 31 శాతం గ్రోత్ సొంతం చేసుకున్నది.
కియా మోటార్స్ సెల్టోస్ కారు 2021లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీ కార్లలో ఐదో స్థానం పొందింది. 2020లో 96,932 కార్లు అమ్ముడు కాగా, గతేడాది 98,187 యూనిట్లు సేల్ అయ్యాయి. ఆరు స్థానంలో నిలిచిన కియా సొనెట్ 79,823 యూనిట్లు సేల్ అయ్యాయి. తర్వాతీ స్థానాల్లో ఎక్స్‌యూవీ, మహీంద్రా స్కార్పియో, నిస్సాన్ మాగ్నైట్, ఎంజీ హెక్టార్ నిలిచాయి.