యవ్వన దశలో, తాము చదువుకునే కాలంలో, భవిష్యత్తులో ఏం కావాలో.. ముందే లక్ష్యం పెట్టుకొని కృషిచేయటం సహజం. ఈ కాలంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు విపరీతంగా రావడమే కాదు, మోటివేషన్ క్లాసులు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. గత 50 ఏండ్ల కిందటి కాలానికి, ఇప్పటి కాలం ఆలోచనల్లో బోలెడంత వ్యత్యాసం ఉన్నది. 50 ఏండ్ల కింద వ్యక్తిత్వ వికాసంతో పాటుగా ఆ కాలానికి సామాజిక వికాసం అన్నది సిలబస్‌లో లేని పాఠంగా అందరిలో బలంగా ఉండేది.
యాభై ఏండ్ల కింది నాటి జాతీయ, అంతర్జాతీయ స్థితిగతులు, దేశంలోని సామాజిక పరిస్థితులు, సోషలిస్టు తరహా దేశ నిర్మాణం, సమసమాజ నిర్మాణ చర్చలు విస్తృతంగా జరిగేవి. అందుకు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వేదికలయ్యేవి. ఆ సందర్భాన్నే ఎర్ర భావా ల పరిభాషలో కళాశాలలు కదనరంగాలుగా మారాయని చెప్తుంటారు..
సరిగ్గా ఆ సమయంలో 25 ఏండ్ల వయస్సులో ఎం.ఏ.ఇంగ్లీష్‌ను పూర్తిచేసుకున్న సిరికొండ మధుసూదనాచారి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వెంటనే ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యేవాడు. తన తమ్ముళ్లు, అన్నలు, చెల్లెళ్లు అంతా ప్రభుత్వ ఉద్యోగులే. ఇంగ్లీష్ లెక్చరర్ల కోసం నోటిఫికేషన్ పడితే తండ్రి ఒత్తిడి మీద మధుసూదనాచారి దరఖాస్తు చివరిరోజున సర్వీస్ కమిషన్‌కు వెళ్లి ‘పోస్టులెన్ని, దరఖాస్తులెన్ని’ అని అడిగాడు. పోస్టులు 70, అప్లికేషన్లు 69 అని చెప్పారు. అయినా మధుసూధనాచారి అప్లయ్ చేయలేదు. తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఎమ్మెల్యే కావాలనుకున్నారు. రాజ్యాధికారంలో తన జాతి ఎక్కడుందో అర్థం చేసుకున్నారు. తన జాతికి ధనం, రాజ్యాధికారం లేదని ఆయనకు అర్థమైంది. దేశంలో చట్టసభల్లోకి పోయిన కులాలు, నేటికీ చట్టసభలకు పోలేని కులాలు ఎందుకున్నాయో శోధించారు.
ఉమ్మడి ఏపీలో విశ్వకర్మ కులానికి ఎందుకు ప్రాతినిధ్యం లేదో వెతికారు. ఇదే ఆయన రాజకీయాల్లోకి రావటానికి, 1994లో 38 ఏండ్ల వయస్సులో ఎమ్మెల్యే కావటానికి దోహదం చేసింది. నాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వటంతో గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు, తెలంగాణ అస్తిత్వంతో ఉద్యమ రాజకీయపార్టీగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో టీఆర్ఎస్ అవతరించింది. కేసీఆర్ నేతృత్వంలో పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా మధుసూదనాచారి చేరాడు. 2001 ఏప్రిల్ 27 నుంచి నేటివరకు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను విడవకుండా నిలిచారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన మధుసూదనాచారి ఆయన చెప్పే ప్రతి విషయాన్ని రికార్డు చేసేవారు.
రాష్ట్ర సాధన ఉద్యమంలో 2001 నుంచి 2014 జూన్ 2 వరకు టీఆర్ఎస్ ఉద్యమ చరిత్రను రేఖామాత్రంగానైనా రికార్డు చేద్దామని నేనొక ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ సందర్భంగా 2020లో బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి ఆఫీస్ ఇంచార్జి ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డిని కలిశాను. లైబ్రరీ ఎక్కడుందని అడిగాను. ఇద్దరు మనుషులనిచ్చి లైబ్రరీకి పంపారు. పార్టీ కార్యాలయంలో పాత పేపర్లన్నీ తిరగేస్తుంటే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా కేసీఆర్ స్పీచ్‌ను మధుసూదనాచారి స్వహస్తాలతో రాసిన నోట్స్ దొరికింది. అట్లే పాత పేపర్లు తిరగేస్తుంటే ఆయన రాసిన అనేక రాతప్రతులు దొరికాయి. పార్టీ, నిర్మాణ, నిర్వహణల్లో ఆయన విలువ ఏమిటో తెలుసుకునేందుకు ఇది చాలు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత 2014లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా మధుసూదనాచారి గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు తొలి స్పీకర్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయితే సిరికొండ మధుసూదనాచారి తొలి స్పీకర్ అయ్యారు. 2023 నుంచి కేసీఆర్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉంటే 2024 నుంచి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా సిరికొండ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
సిరికొండ మధుసూదనాచారి స్పీకర్‌గా ఉన్నప్పుడు భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన చెంచులను, రాజన్నలవారు, పిట్టలవారు, కోతులవారులకు హైదరాబాద్ నగరాన్ని చూపించి శాసనసభలోకి తీసుకువెళ్లారు. ఏ వర్గాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం లేదో అలాంటి కులాలను ఆహ్వానించి శాసనసభను చూపించిన మనసున్న మనిషి మధుసూదనుడు.
25 ఏండ్ల వయస్సులో రాజకీయాల్లోకి రావాలనుకున్న సిరికొండ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ తొలి స్పీకర్‌గా చరిత్రలో నిలిచారు. ప్రజాక్షేత్రంలో నాయకులు ఎదుర్కొనే అనేక సమస్యలను సిరికొండ చవిచూశారు. ఎత్తుపల్లాలను అధిగమించారు. సిరికొండ ఆత్మ కేసీఆర్, హృదయం బహుజనతత్త్వం. తెలంగాణ అస్తిత్వం పరిపూర్ణం చేయడానికి బీసీ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని ప్రతిష్ఠించాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకు బీసీలకు అండగా బీఆర్ఎస్ వేస్తున్న అడుగులకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ముగ్గులు పోయమని సిరికొండను కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని ఊపిరిగా చేసుకొని సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న సిరికొండకు అభినందనలు.