సిటీబ్యూరో, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): ఈనెల 27న అప్పర్ ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివాల్ నిర్వహిస్తున్న సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ చుట్టూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, కర్బాలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాలకు ఆ సమయంలో అనుమతి లేదని, ఇక్బాల్మినార్ నుంచి ట్యాంక్‌బండ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద కట్టమైసమ్మ, డీబీఆర్, ఇందిరాపార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వైపు మళ్లిస్తామని తెలిపారు. వీవీ విగ్రహం నుంచి ఎన్టీఆర్మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ వద్ద ఇందిరాగాంధీ విగ్రహం వైపు ప్రసాద్ ఐమాక్స్, మింట్‌కాంపౌండ్ లైన్ మీదుగా మళ్లిస్తామని చెప్పారు. నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధభవన్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదని, వాటిని నల్లగుట్ట క్రాస్‌రోడ్స్ నుంచి రాణిగంజ్, నెక్లస్రోడ్ మీదుగా మళ్లిస్తామని జోయల్‌డేవిస్ పేర్కొన్నారు.
లిబర్లీ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి ఇక్బాల్మినార్ యు టర్న్ వయా తెలుగుతల్లి జంక్షన్ నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లే వాహనాలను కర్బామైదాన్ నుంచి బైబిల్‌హౌస్, జబ్బార్ కాంప్లెక్స్, కవాడిగూడ, గాంధీనగర్ టీ జంక్షన్, గోశాల, దోభీఘాట్, స్విమ్మింగ్‌పూల్, బండమైసమ్మ, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని సూచించారు. ముషీరాబాద్, కవాడిగూడ జంక్షన్ నుంచి చిల్డ్రన్‌పార్క్ వైపుగా ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతి లేదని, డీబీఆర్ మిల్స్ నుంచి ఎమ్మార్వో ఆఫీసు, దోభీఘాట్, స్విమ్మింగ్‌పూల్, బండమైసమ్మ, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ మీదుగా మళ్లిస్తామని జోయల్ డేవిస్ తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వైపు వచ్చే జిల్లాల ఆర్టీసీ బస్సులను స్వీకార్ ఉప్కార్ జంక్షన్ మీదుగా మళ్లిస్తామని, సిటీ బస్సులను కర్బాల మైదాన్ నుంచి బైబిల్‌హౌస్ మీదుగా పలు జంక్షన్ల ద్వారా తెలుగుతల్లి ఫ్లైఓవర్వైపు మళ్లిస్తామని ఆయన పేర్కొన్నారు. నగరప్రజలు ఖైరతాబాద్; సైఫాబాద్ పాత పీఎస్, ఇక్బాల్మినార్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లస్రోటరీ, లిబర్టీ, రవీంద్రభారతి, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వద్ద ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది, కాబట్టి ఆ రూట్లలో తమ ప్రయాణాలు లేకుండా వేరే మార్గాల వైపు ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. బతుకమ్మ కార్నివాల్‌కు వచ్చేవారి కోసం స్నోవరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, అమరవీరుల స్మారకం, రేస్‌కోర్స్ రోడ్, బీఆర్కే భవన్, హెచ్ఎండీఏ పార్కింగ్, సంజీవయ్య పార్క్ ప్లేస్, లుంబిని పార్క్ ఎదురుగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్‌డేవిస్ తెలిపారు.