న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: తప్పుడు కారణాలతో తమ భవిష్య నిధి(పీఎఫ్) సొమ్మును విత్డ్రా చేసుకుంటే జరిమానాలు వంటి చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తన సభ్యులను హెచ్చరించింది. తప్పుడు కారణాలతో పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకున్న సభ్యుడి నుంచి తిరిగి సొమ్మును రికవరీ చేసుకునే అధికారం సంస్థకు ఉందని ఈపీఎఫ్ఓ ఓ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించింది. ఏదో ఒక కారణంతో తమ పీఎఫ్ సొమ్ములో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకోవచ్చని చాలామంది భావిస్తుంటారు. కాని ఈపీఎఫ్ఓ నిబంధనలు నిధుల దుర్వినియోగానికి ఒప్పుకోవు.
ప్రస్తుత ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల ప్రకారం రిటైర్మెంట్ తర్వాత లేక 58 ఏళ్ల పదవీ విరమణ వయసుకు చేరుకున్న తర్వాత మాత్రమే పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. అయితే వైద్య అత్యవసరాలు, పిల్లల చదువు, వివాహం, ఇంటి నిర్మాణం వంటి నిర్దిష్టమైన అవసరాలకు పాక్షికంగా నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. నిధులకు సంబంధించిన ప్రతి ఉపసంహరణకు ఏ కారణం కోసం నిధులను ఉపయోగిస్తున్నదీ తెలియచేయడంతోపాటు అందుకు రుజువుగా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
అయితే ఈ షరతులను ఉల్లంఘించిన పక్షంలో ఉపసంహరించిన నిధులను వడ్డీ, జరిమానాలతో కలిసి తిరిగి రాబట్టే అధికారం ఈపీఎఫ్ఓకి ఉంటుంది. సభ్యులు నిధుల పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసే ముందు నిబంధనలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచించింది. తప్పుడు కారణాలతో పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకున్న పక్షంలో ఈపీఎఫ్ పథకం 1952 కింద తిరిగి రాబట్టుకోవడం జరుగుతుందని ఈపీఎఫ్ఓ తన ఎక్స్ ఖాతాలో హెచ్చరించింది.