హానుమకొండ, ఆగస్టు 5 : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మలి దశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిది. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రమని తెలిపిన జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ప్రస్తుత హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6న ఆయన జన్మించారు.
చిన్ననాటి నుంచే ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై అవగాహన పెంచుకున్నారు. 1952లో జరిగిన ములీ, 1969 తెలంగాణ ఉద్యమం నుంచి మలి విడత వరకు ఆయన చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష, నీటి పంపిణీ, ఉద్యోగాలు, విద్యావకాశాల్లో ఉన్న అసమానతలను గణాంకాలతో సహా వివరిస్తూ ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) రిజిస్ట్రార్‌గా, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్‌లో వివిధ బాధ్యతల్లో ఆయన పనిచేశారు. అనంతరం కేయూ ఉపకులపతిగా సేవలందించి విద్యా రంగంలో విశేష కృషి చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయ, సామాజిక, విద్యార్థి సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో, తెలంగాణ భావజాలాన్ని గ్రామం నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత కూడా ఉద్యమానికి సలహాదారుగా, మార్గదర్శిగా వ్యవహరించారు. 2011 జూన్ 21న సార్ కన్నుమూసినప్పటికీ, ఆయన ఆశయాలు ప్రజల్లో సజీవంగా ఉన్నాయి. కాగా, హనుమకొండ బాల సముద్రంలోని ఏకశిల పార్కుకు జయశంకర్ స్మృతి వనంగా నామకరణం చేశారు. ఆయన గౌరవార్థంగా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించనున్నారు.