మహబూబ్‌నగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రైతులకు అందించే పరిహారాన్ని స్వాహా చేసేందుకు వేసిన పన్నాగం బయటపడింది. తాజాగా ఈ స్కామ్ వెనుక రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉన్నట్టు బహిర్గతమైంది. ఉన్నతాధికారులను సైలెంట్ చేసి కిందిస్థాయి అధికారులను పావులుగా వాడుకొని కాంగ్రెస్ నేతలు సృష్టించిన రికార్డులు ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కాయి. ఎత్తిపోతలలో మునుగుతున్న ప్రభుత్వ భూములకు 1969లోనే భారీ ఎత్తున పట్టాలు ఇచ్చినట్టు ఈ రికార్డులు చెబుతున్నాయి. అసైన్మెంట్ కమిటీని అడ్డు పెట్టుకొని ఆ రిజిస్టర్లో తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లను చేర్చారు. కమిటీ ద్వారా పేరపళ్ల గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి 87, 92, 111 సర్వే నెంబర్లలో ఏకంగా 201మందికి గాను 771.23 ఎకరాలు పంపిణీ చేసినట్టు రికార్డులు సృష్టించారు.
కోట్ల రూపాయల పరిహారం దండుకునేందుకు ఈ రికార్డులను అనుకూలంగా మార్చినట్టు తేటతెల్లమైంది. ఇదిలా ఉండగా 1969లో పట్టాలు పొందిన ఈ రైతుల పేరు మీద మరే ఇలాంటి రికార్డులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అసైన్మెంట్ కమిటీని అడ్డు పెట్టుకొని అమాయక రైతులతో కమీషన్లు మాట్లాడుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వం పరిహారం ఇస్తే పొలానికి పొలం తీసుకోవాలని చూస్తుంటే కాంగ్రెస్ నేతలు బినామీ రైతులకు ఆశచూపించి కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ వ్యవహారంపై లోకాయుక్త, విజిలెన్స్‌కు ఫిర్యాదులు చేయనున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి వెల్లడించారు. కమిషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారని, రైతులకు ఇచ్చే పరిహారంలో అందిన కాడికి దోచుకోవాలని కాంగ్రెస్ నేతలను ఉసిగొల్పినట్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని దండుకునేందుకు కాంగ్రెస్ నేతలు రెవెన్యూ అధికారులు కలిసి రికార్డులను సృష్టించారు. ఈ మేరకు అప్పట్లో ఉన్న అసైన్మెంట్ కమిటీని అడ్డు పెట్టుకొని భారీ స్కెచ్ వేశారు. నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో జయమ్మ చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చున్నారు. ఇప్పుడున్న చెరువు కట్ట విస్తీర్ణాన్ని పెంచి నీటిని ఇక్కడ నిల్వ చేస్తారు. అక్కడినుంచి దామరగిద్ద మండలం కాన్కుర్తి చెరువుకు పంపిస్తారు. ఇదిలా ఉండగా జయమ్మ చెరువులో మొత్తం ప్రభుత్వ భూములే ఎక్కువ భాగం మునుగుతున్నాయి. అయితే సర్వే నంబర్ 87, 92, 111లో 996 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. పంప్‌హౌస్ ప్రెజర్ మెయిన్ చెరువు కట్ట పెంచడంతో సుమారు 380 ఎకరాల వరకు భూమి అవసరం.
అయితే రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చి సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ భూములకు నష్టపరిహారం ఇవ్వకూడదని ఉన్నప్పటికీ.. భూసేకరణ చట్టం-2013 ప్రకారం వీరు కూడా పరిహారానికి అర్హులేనని తేల్చారు. అయితే ఇక్కడ ఎక్కువ భాగం ప్రభుత్వ భూములే సేకరించాల్సి వచ్చింది. కొంతభాగం మాత్రమే రైతులు సాగుచేసుకునే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఈ భూములన్నీ గుట్టలే.. వ్యవసాయానికి అంత అనువుగా లేవు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ అసైన్డ్ భూములు లావణి పట్టాలు పొందిన వారు కొంతమంది అయితే.. అవి ఇరిగేషన్ శాఖ ఇచ్చిన మార్కింగ్‌లో లేవు. దీంతో కాంగ్రెస్ నేతలు కమీషన్లు మాట్లాడుకొని మొత్తం ప్రభుత్వ భూమి ఎంత పోతుందో ఆ మేరకు రికార్డులు సృష్టించి పరిహారం ఇప్పిస్తామని అనడంతో చాలామంది దళారులను ఆశ్రయిస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని ఓ కాంగ్రెస్ నేత ముఖ్య అనుచరుడు.. ఓ ఎమ్మెల్యే పీఏ రంగంలో దిగి వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు.

జయమ్మ చెరువు కట్టలు ఇప్పుడున్న దానికి పదింతలు పెంచుతున్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు మునుగుతున్నాయి. అయితే వీటికి పట్టాలు లేవు. ఇక్కడే అక్రమాలకు బీజం ఏర్పడింది. కొడంగల్ ఎత్తిపోతల పథకం డిజైన్‌లో భాగంగా మార్కింగ్ ఇచ్చిన ప్రాంతాలను గుర్తించి వాటికి పరిహారం అందించాల్సి రావడంతో అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వ భూములను తాము చెప్పిన వారి పేరున పట్టాలు సృష్టించాలని ఓ కాంగ్రెస్ నేత ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఇందుకోసం అసైన్మెంట్ కమిటీ రికార్డులు ఉపయోగించుకున్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న అసైన్మెంట్ కమిటీ ద్వారా భూమి లేని నిరుపేదలకు కమిటీ సూచించిన మేరకు ఎకరా నుంచి మూడు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని పట్టాలుగా ఇస్తున్నది.
1978 నుంచి 2013 వరకు అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. ఇందులో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల దరఖాస్తులను పరిశీలించి మాత్రమే అసైన్మెంట్ కమిటీ భూములను కేటాయిస్తుంది. కానీ విచిత్రంగా 1969లో అసైన్మెంట్ కమిటీ ద్వారా పేరపళ్ల శివారులోని 87 సర్వే నంబర్లో 382.13 ఎకరాలు, 92 సర్వే నంబర్లో 133 ఎకరాలు, 111 సర్వే నంబర్లో 256.10 ఎకరాలు భూ పంపిణీ చేసినట్టు రికార్డులు సృష్టించారు. అసైన్మెంట్ కమిటీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక్క గ్రామానికి ఇన్ని ఎకరాలు పంచిన దాఖలాలు ఎక్కడా లేవు. 1969లో ఎవరు ఇచ్చారు? అప్పుడు ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? సభ్యులు ఎవరు? ఏ తేదీల్లో ఇచ్చారు? భూమి పొందిన వాళ్లంతా బలహీన వర్గాలేనా అనే సమాచారం ఎక్కడా ఈ రికార్డుల్లో లేదు. కేవలం కొడంగల్ ఎత్తిపోతల పథకంలో రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని పక్కదారి పట్టించేందుకే పక్కా స్కెచ్‌తో రెవెన్యూ అధికారుల ద్వారా ఈ రికార్డులను సృష్టించినట్టు తేటతెల్లమవుతున్నది.
కేవలం కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి, అతని సోదరుడు తిరుపతిరెడ్డి కొడంగల్ ఎట్టిపోతల పథకం చేపట్టారని మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. పేరపళ్ల భూసేకరణలో వస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని, ఈ వ్యవహారంపై లోకాయుక్త, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్టు బుధవారం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఎత్తిపోతల పథకంలో సామాన్య రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడుతుంటే కాంగ్రెస్ నేతలు కమీషన్ల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే కొడంగల్‌లో ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ హబ్ పేరుతో పేదల భూములను లాక్కొని బడాబాబులకు కట్టబెట్టి రూ.కోట్లలో కమీషన్లు దండుకున్న ఘనత రేవంత్‌రెడ్డి సోదరులకే దక్కిందని దుయ్యబట్టారు.
భీమా ప్రాజెక్టు అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో అదే భీమా ప్రాజెక్టుపై చేపట్టి మొత్తం నారాయణపేట నియోజకవర్గ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టి కొడంగల్‌కు ఏదో నీళ్లు తీసుకుపోయామని భ్రమింపజేసి రూ.2,400 కోట్లతో చేపట్టే ఈ పథకంలో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. సీఎం సోదరులు పొంగులేటి కంపెనీ కోసం సామాన్య రైతులను సమిధలుగా మార్చుతూ కమీషన్లు దండుకుంటున్న వ్యవహారాన్ని న్యాయస్థానానికి వెళ్లి ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దమ్ముంటే భూసేకరణ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. నిజమైన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని, త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.

కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణ నోటిఫికేషన్ ఏఐసీసీ జాబితాను తలదన్నేలా మారుతున్నది. మొదటిసారి 2025 జూన్ 19న అనుకూలంగా ఉన్న పత్రికల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత 2026, జూన్ 8న రెండోసారి అధికారిక వెబ్సైట్ జాబితా ప్రత్యక్షమైంది. ఈ లోపు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమనడంతో ఇదే తేదీ, అదే జీవో కానీ పేర్లు మాత్రం వేరు చేస్తూ తుది జాబితా ఆర్డీవో కార్యాలయంలో సిద్ధమైంది. అక్రమాలు బయటపడ్డప్పుడల్లా జాబితా మారుతున్నది.
అందులో కూడా బినామీ పేర్లు బయట పడుతుండటంతో మరొకటి బయటికొస్తున్నది. ఇది తుది జాబితా అంటూనే ఇంకా కొన్ని సవరణలు చేస్తూ మరో 96 ఎకరాలకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని రెవెన్యూ అధికారులు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితా మాదిరిగా పేరపళ్ల నోటిఫికేషన్ జాబితా మారుతుండటం గమనార్హం. అన్నిచోట్ల సజవుగా జరిగినా ఒక్క పేరపళ్లలో మాత్రం అక్రమాలకు తెరలేపడం వెనుక కాంగ్రెస్ నేతలకు కుట్రలు బయటపడుతున్నాయి.