Censorship | భారతదేశంలో సినిమాల సర్టిఫికేషన్ కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా సవరించిన నిబంధనలను విడుదల చేసింది. 1991 నాటి పాత మార్గదర్శకాల స్థానంలో ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ తాజా నిబంధనలపై సినీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది సర్టిఫికేషన్ కాదని, పూర్తిగా సెన్సార్ చేయడమేనని నెటిజన్లు, సినీ ప్రియులు మండిపడుతున్నారు.
ఇక కొత్త నిబంధనల ప్రకారం.. సినిమాలలో హింస, డ్రగ్స్, ధూమపానం వంటి వాటిని ప్రోత్సహించేలా చూపకూడదు. లైంగిక దాడి దృశ్యాలను గ్రాఫిక్ రూపంలో ప్రదర్శించరాదు. మహిళలను కించపరిచేలా లేదా తక్కువ చేసి చూపేలా కంటెంట్ ఉండకూడదు. చిన్నారులు హింసకు గురయ్యే లేక హింసను ఎదుర్కొనే సన్నివేశాలపై ఆంక్షలు విధించారు. అలాగే, కోర్టుల గౌరవానికి భంగం కలిగించేలా, విదేశీ సంబంధాలను దెబ్బతీసేలా లేదా దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా చిత్రాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే, ఈ మార్గదర్శకాలను సినిమాను మొత్తంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు (CBFC) సూచించినప్పటికీ, ఇవి సృష్టికర్తల స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఈ నిబంధనల వల్ల భారతదేశంలో సామాజిక-రాజకీయ చిత్రాలు రావడం కష్టమని, సమాజంలో జరిగే తప్పులను ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకే వీటిని తెచ్చారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సెన్సార్ నిబంధనలు ఇలాగే కఠినంగా ఉంటే థియేటర్లకు ప్రేక్షకులు రావడం కష్టమని, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఇది పెద్ద ఎదురుదెబ్బని సినీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.