హనుమకొండ, నవంబర్ 12 : ఫిరంగిలాంటి మాటలు.. నిప్పు కణికల్లాంటి కవితలతో కవిత్వాన్ని కాలాతీతం చేసిన కలం యోధుడు కాళోజీ నారాయణరావు. ఒక్క సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ అక్షరాలను ఆయుధాలుగా చేసి, పాలకులపైకి ఎక్కుపెట్టిన తెలంగాణ తొలిపొద్దు. నిజాం నిరంకుశ పాలనను నిలువునా తూర్పారబట్టిన గళం.. కలం.. గురువారం కాళోజీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
అణచివేత, అన్యాయం ఎకడ, ఏ రూపంలో ఉన్నా ఎదిరించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. పోరుగల్లు ఓరుగల్లులో ప్రజల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ యాసలో అనేక కవితలు రాశారు. ఆయన రచనల్లో ప్రసిద్ధిగాంచింది ‘నా గొడవ.’ తెలంగాణ గోస ను ప్రత్యక్షంగా చూసి కన్నీరు పెట్టిన కాళోజీ, ఆ దుఖాన్ని తన అక్షరాల్లో నింపారు. నిజాం నిరంకుశంత్వాన్ని ఎదిరించి, విద్యార్థిగా ఉన్నప్పుడే వరంగల్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షర కాంతులు వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్రసారస్వత పరిషత్ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.
రజాకార్ల దురాగతాలను ప్రతిఘటిస్తూ 1945లో ఓరుగల్లు కోటలో జాతీయ జెండా ఎగురవేయాలని ప్రయత్నించారన్న కారణంతో నగర బహిష్కరణకు గురయ్యారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1958లో ఉపాధ్యా య నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. ప్రజా కవిగా గుర్తింపు పొందిన నారాయణరావును పద్మ విభూషణ్‌తో పాటు పలు అవార్డులు వరించాయి. సామాన్యుడి భాష, యాస ద్వారా సమస్యలపై గళం విప్పి, తెలంగాణ విముక్తి కోసం నిరంతరం పరితపించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.
జీవితాంతం రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావును తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా గౌరవించింది. ఆయన పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా నగర నడిబొడ్డన హనుమకొండలో 2.25 ఎకరాల్లో కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మించింది. నేడు కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించ నున్నా రు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సాహితీ వేత్తలు, కవు లు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.