న్యూఢిల్లీ : ఐపీఎల్లో అదరగొడుతున్న బ్యాటింగ్ సంచలనం, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ జట్టులోకి వచ్చాడు. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. వైభవ్ చోటు దక్కించుకున్న ఈ జట్టుకు హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యా డు. జూన్ 9 నుంచి జూన్ 21 వరకు డంబుల్లా వేదికగా జరిగే ఈ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక-ఏతో పాటు ఆఫ్ఘ్ఘానిస్తాన్-ఏ కూడా పాల్గొంటుంది. అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యవంశీని భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ముందుగా ‘ఏ’ జట్టులో అతడిని పరీక్షించాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.
జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే సీనియర్ జట్టు యూకే పర్యటనకు ముందు జరిగే ఈ సిరీస్‌లో అతనికి అవకాశం కల్పించింది. ఈ జట్టు సగటు వయసు 23 ఏండ్ల్లు ఉండటం విశేషం. యశ్ ఠాకూర్, అర్షద్ ఖాన్, యుధ్వీర్ సింగ్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా 25 ఏళ్ల లోపు వారే. జట్టులో తిలక్, రియాన్ పరాగ్, అన్షుల్ కాంబోజ్ వంటి ఆటగాళ్లకు ఇప్పటికే సీనియర్ భారత జట్టు తరపున ఆడిన అనుభవం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్ జూన్ 9, 15వ తేదీల్లో శ్రీలంక-ఏతో, 11, 17న ఆఫ్ఘాన్‌తో తలపడుతుంది. 21న ఫైనల్ జరుగుతుంది.
జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.