రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)/ తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తున్నది. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని శివారు గ్రామాల్లో సంచరిస్తూ బేంబేలేత్తిస్తుననది. మూడు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, తిప్పాపూర్ గ్రామాల్లో మూగజీవాలపై దాడి చేసింది. దీంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పులి జాడను కనిపెట్టేందుకు అధికారులు పరుగులు తీస్తున్నారు.
పులి సంచరించిన ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం తంగళ్లపల్లి శివారులో రైల్వే పనులు చేస్తున్న కూలీలకు పెద్దపులి కనిపించడంతో పరుగులు తీశారు. గురువారం అటవీ అధికారులు పంట పొలాల్లో పులి పాదముద్రలను ధ్రువీకరించారు. అలాగే తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లె మానేరు నది తీరం వెంట గుట్టలలో పెద్దపులి కనిపించిందని మత్స్యకారులు తెలుపడంతో అధికారులు పరిశీలించారు. పాదముద్రలు పెద్ద పులివేనని స్పష్టం చేశారు.
ఎఫ్ఆర్వో కల్పనాదేవి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రెండు రోజుల వరకు పొలాల వద్దకు వెళ్లవద్దని రైతులకు సూచించారు. పెద్ద లింగాపూర్ గ్రామ శివారు నుంచి పెద్దపులి ఇటువైపు వచ్చిందని, ట్రాప్ చేయడానికి కెమెరాలు, రెస్యూ టీం, డీఎఫ్వో బాలమణి, సిబ్బంది అకడే ఉండి గమనిస్తున్నారని చెప్పారు.