సిద్దిపేట, ఫిబ్రవరి 20 : పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీశాఖ అధికారులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో నెల రోజుల నుంచి పులిసంచారం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఎనిమిది దూడలపై పులిదాడి చేయడంతో చనిపోయాయని, రైతులకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు.
ఇప్పటికే ప్రత్యేక రెస్క్యూటీమ్ ఏర్పాటు చేశామని, ఆటీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందన్నారు. పులిసంచారం పై అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని, పొలాలు, బావుల వద్దకు వెళ్లే రైతులు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేటలో అద్భుతమైన ఆక్సిజన్ పార్కు ఏర్పాటు చేసుకున్నామని, దాని నిర్వహణ బాగుండాలని చెప్పారు. ప్రజల వాకింగ్‌కు, పర్యాటకంగా ఉపయోగపడేలా దాన్ని తీర్చిదిద్దామని చెప్పారు.. మెగా నర్సరీ నిర్వహణ కూడా పర్యవేక్షణ చేయాలని సూచించారు. వేసవి దృష్ట్య మొకలు ఎండిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమీక్షలో సిద్దిపేట జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి, ఎఫ్ఆర్వో విక్రమ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు ఉన్నారు.