Medak | చేగుంట: కాటిలో కాలుతున్న శవాలను బయటకు లాగేసి, చితిలో నుంచి బూడిదను ఎత్తుకెళ్తున్న ఘటన మెదక్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. చేగుంట స్మశానంలో చితిలో నుంచి మృతదేహాలను బయటకు లాగేసి.. అక్కడి బూడిదను ఎత్తుకెళ్తున్నారు. గత రెండు రోజుల్లో రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన కర్రె నాగమణి (70) శుక్రవారం ఉదయం మరణించింది. ఆమె మృతదేహానికి స్థానిక వైకుంఠధామంలో కుటుంబసభ్యులు, బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులు చితి వద్దకు వెళ్లి చూడగా.. సగం కాలిన మృతదేహాన్ని చితిలో నుంచి బయటపడేసి కనిపించింది. అది చూసి నాగమణి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు.
ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు.. రెండు రోజుల క్రితం కూడా మురాడి నర్సమ్మ వృద్ధురాలి అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత.. ఆమె చితి నుంచి తల భాగంలోని చితాభస్మాన్ని ఎత్తుకెళ్లారు. ఇలా శవాల దగ్గర చితాభస్మాన్ని ఎత్తుకెళ్లడం ఇప్పుడు చేగుంట పరిధిలో కలకలం సృష్టిస్తోంది. బంగారం కోసమే ఇలా బూడిదను ఎత్తుకెళ్తున్నారా? లేదా ఏవైనా క్షుద్ర పూజల కోసమా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు.. వైకుంఠ ధామం వద్దకు వెళ్లి పరిశీలించారు.