వెంగళరావునగర్, నవంబర్ 19 : ఆటోలో ప్రయాణికుడి దృష్టి మరల్చి చోరీకి పాల్పడిన ఘటనపై మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధి అమీర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్‌లో నివాసం ఉండే ప్రైవేట్ ఉద్యోగి ఫణికుమార్ (51) ఈనెల 17వ తేదీ రాత్రి ఎర్రగడ్డ వైపునకు వెళ్లేందుకు అమీర్‌పేట్ మైత్రీవనం బస్టాప్‌లో ఆటో ఎక్కాడు. కొద్ది సేపు కూర్చొన్నాక..వెనుక సీటులో కూర్చోవాలని ఆటోడ్రైవర్ చెప్పాడు. అప్పటికే మరో ముగ్గురు వ్యక్తులు ఆటోలో ఉన్నారు. దాంతో ఇరుకుగా ఉండటంతో సరిగా కూర్చోలేకపోయాడు.
ఇరువైపులా నుంచి నెడుతుండటంతో ఇబ్బందికరంగా ఉందని చెప్పగా వారు అతనితో వాదులాటకు దిగారు. ఎస్ఆర్నగర్ బస్టాప్ వద్దకు వచ్చేసరికి ఆటో డ్రైవర్ అతన్ని ఆటో నుంచి కిందకు దిగాలని చెప్పడంతో దిగాడు. ఎందుకు దింపావని ఆటోడ్రైవర్‌ను ఫణికుమార్ ప్రశ్నిస్తుండగా ఆటో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత చూసుకునేసరికి జేబులోని పర్సులో దాచిన రూ.3 వేలు, రూ.15 వేలు విలువ చేసే సెల్‌ఫోన్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డెబిట్ కార్డులను ఆటోలో దృష్టి మరల్చి దొంగలు కాజేసినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.