తోలుబొమ్మలాట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రసిద్ధిచెందిన జానపద కళారూపం. రాత్రివేళ దీపాల వెలుగులో తెరపై తోలుబొమ్మలను ఆడిస్తూ కళాకారులు జానపదులకు వినోదం పంచేవారు. దీన్ని కర్ణాటకలో తొగలు గొంబెయాట అని పిలుస్తారు. ఇక్కడిలాగే అక్కడ కూడా తోలుబొమ్మలాట కళారూపం కాల ప్రభావంతో కష్టాలను ఎదుర్కొంటున్నది. ఇలాంటి స్థితిలో కొప్పల జిల్లాకు చెందిన భీమవ్వ దొడ్డబాలప్ప షిల్లె
క్యాతర అనే పండుముదుసలి వాటిని సంరక్షిస్తున్నారు. ఆమెకు ఇప్పుడు 96 ఏండ్లు. ఎన్నడూ బడి మొహమే చూడని భీమవ్వ తమ జిల్లాలో పేరుగాంచిన తోలుబొమ్మలాట కళాకారిణి. కుటుంబ వారసత్వంలో భాగంగా ఆమె తన పద్నాలుగో ఏటనే తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు.
మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలను ఆడించడంలో ఆమె మంచి ప్రజ్ఞ సాధించారు. అంతేకాదు, తోలుబొమ్మలాటలో కిటుకులన్నీ భీమవ్వకు కరతలామలకం. వందకు దగ్గరపడుతున్నప్పటికీ రామాయణ భారతాల్లోని ఘట్టాలను ఆమె పొల్లుపోకుండా నోటికే పాడుతుండటం విశేషం. పాటకు అనుగుణంగా బొమ్మలను ఆడిస్తారు కూడా! ఇప్పుడామె దగ్గర దాదాపు 200 ఏండ్ల నాటి తోలుబొమ్మలు సురక్షితంగా ఉన్నాయి. భీమవ్వకు ఒక్క కర్ణాటకలోనే కాదు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, హాలండ్ దేశాల్లోనూ గుర్తింపు దక్కింది. భారతదేశ సంస్కృతిలో ప్రజలకు ఆటవిడుపు అయిన తోలుబొమ్మలాటలో భీమవ్వ కృషికి ఇప్పటికే ఎన్నో పురస్కారాలు దక్కాయి.
తాజాగా ఈ ఏడాది భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ‘నేను ఇరవై వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చాను. నాకు పద్మశ్రీ ప్రకటించిన విషయం టీవీలో ప్రసారం చేస్తున్నప్పుడు మా ఊరు ఊరంతా సంబరాల్లో మునిగిపోయింది. మా కుటుంబసభ్యులు ఊరువాళ్లందరికీ మిఠాయిలు పంచారు’ అని భీమవ్వ సంతోషపడ్డారు. సినిమా, సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో తోలుబొమ్మల కళ పరిరక్షణకు భీమవ్వ, ఆమె కుటుంబసభ్యులు తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. ఆధునిక యువతరం ఈ కళను అందిపుచ్చుకోవాలనేది ఆమె ఆకాంక్ష. అన్నట్టు భీమవ్వ కొడుకు 75 ఏండ్ల కేశప్ప కూడా తోలుబొమ్మలాటలో పేరు సాధించాడు.