హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 ( నమస్తే తెలంగాణ )/హిమాయత్‌నగర్: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకులు నాశనమవుతుంటే, రాష్ట్ర మంత్రులు మాత్రం విదేశీ టూర్ల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ధ్వజమెత్తారు. హదరాబాద్ హిమయాత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న హైదరాబాద్ ఇందిరా పార్కులో మహా ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఆ మంత్రి మాత్రం విదేశీ టూర్లలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉచిత బస్సు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్ డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రేవంత్ సర్కార్ చోద్యం చూస్తున్నదని ధ్వజమెత్తారు. మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆటో డ్రైవర్ల సత్తాను చాటాలని ఏఐటీయూసీ నేత వెంకటేశం పిలుపునిచ్చారు. సమావేశంలో ఐఎఫ్టీయూ ప్రవీణ్, డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.