నిర్మల్ టౌన్, మార్చి 18 : నిర్మల్ జిల్లాలో కుస్తీ పోటీలకు ఆదరణ పెరుగుతున్నది. సరిహద్దు గ్రామాల్లో ఎక్కడ జాతర
నిర్వహించినా మల్లయుద్ధం (కుస్తీ పోటీలు) నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో జిల్లాలో కుస్తీ పట్టే
మల్లయోధులు రోజురోజుకూ పెరుగుతున్నారు. బలంతో పాటు టెక్నిక్‌తో కుస్తీలు నేర్చుకొని పోటీల్లో బలమైన
ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ విజేతలవుతున్నారు.
నిర్మల్ జిల్లాలో పదేండ్ల నుంచి సంప్రదాయ పండుగలకు కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. జిల్లాలోని
కుంటాల, కుభీర్, తానూర్, ముథోల్, బాసర, సారంగాపూర్ మండలాల్లో గిరిజన జాతరలు జరుగుతాయి. ముఖ్యంగా
శివరాత్రి, హనుమాన్ జయంతి, విఠలేశ్వర ఉత్సవాలు ఇలా ఏవి జరిగినా కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా
కొనసాగిస్తున్నారు. దీంతో పెద్దఎత్తున మల్లయోధులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి రూ.10 నుంచి
రూ.10వేల వరకు నగదుతో పాటు వెండి, బంగారు కడియాలు, ఉంగరాలు బహూకరిస్తున్నారు. విజేతలను గ్రామాల్లో
డప్పువాయిద్యాలతో ఊరేగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కుస్తీలు నేర్చుకొని పోటీల్లో దిగేందుకు యువత
కూడా ఆసక్తి చూపడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
నిర్మల్ జిల్లాలో గతంలో ఎక్కడ కుస్తీ పోటీలు నిర్వహించినా మహారాష్ట్ర మల్లయోధులే ఎక్కువగా వచ్చేవారు.
ధర్మాబాద్, హిమాయత్‌నగర్, కిన్వట్, నాందేడ్, అప్పారావ్పేట్, షివిని, పర్బని, ముద్కేడ్, బిలోలి తదితర ప్రాంతాల
నుంచి పెద్ద ఎత్తున కుస్తీ వీరులు వచ్చేవారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ప్రత్యర్థులుగా ఎంచుకొని కుస్తీలు
పట్టి పైచేయి సాధించేవారు. ఒక్కొక్క బృందంలో 10-15 మంది ఉండేవారు. వీరు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన టీం లీడర్లతో
తరలివచ్చి ఇక్కడ మల్లయుద్ధంలో పోటీపడేవారు. ఈ పోటీలు చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు
కూడా వస్తారు. ఐదేండ్ల నుంచి నిర్మల్ జిల్లాలో స్థానిక యువత, విద్యార్థులు కుస్తీలపై ఆసక్తి పెంచుకున్నారు. తాము
సైతం కుస్తీకి సై అంటున్నారు. ఇందులో ప్రధానంగా ముథోల్ మండలంలోని బిద్రెల్లి, తానూర్ మండలంలోని మొగిలి,
కోలూర్, కుభీర్ మండలంలోని హల్దా, పల్సి, సిర్పెల్లి గ్రామాలకు చెందిన యువకులున్నారు. ఐదో తరగతి విద్యార్థి
నుంచి ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారు ప్రత్యేక శిక్షణ తీసుకొని కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నారు.
మాది మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్ గ్రామం. పదేండ్ల నుంచి కుస్తీ పడుతున్నా. ఎక్కడ పోటీలు నిర్వహించినా
అక్కడికెళ్లి రూ.100 నుంచి రూ.300 వరకు బహుమతి వచ్చే కుస్తీ పడుతున్నా. ప్రత్యర్థులు ఎంత గట్టివారైనా
కుస్తీలో మాత్రం ఓడించేందుకు కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తాం. ఒక్కొక్కసారి గంట, రెండు గంటలు గడిచినా కుస్తీ పోటీ
ఫలితం తేలదు. అప్పుడు మాలో మరింత కసి పెరుగుతుంది. నిర్వాహకులు వద్దని చెప్పినా దాన్ని చాలెంజ్‌గా
తీసుకొని ప్రత్యర్థిని చిత్తు చేస్తాం. కుస్తీ పట్టేటప్పుడు చెమట వస్తే మట్టిని శరీరంపై పోసి జారీ పోకుండా చూసుకుంటాం.
– ఓంకార్, హిమాయత్‌నగర్, మహారాష్ట్ర
మాది కుంటాల మండలంలోని లింబా(బీ) లంబాడీ తండా. మేము ఇద్దరం అన్నదమ్ములం. డిగ్రీ వరకు
చదువుకున్నాం. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాం. మాకు కుస్తీ పట్టాలని ఆశ ఉండడంతో ఎక్కడ పోటీలు
నిర్వహించినా అక్కడికెళ్లి పడుతున్నాం. ప్రారంభంలో రూ.10 వచ్చేవారు. ఇప్పుడు కుస్తీ పడితే రూ.500 వరకు
బహుమతులు ఇస్తున్నారు. కుస్తీలో గెలిచినప్పుడు ప్రేక్షకులు చూపుతున్న ఆదరణ మరువలేనిది.
– అంకుస్
తెలంగాణ ప్రాంతంలో జాతర సందర్భంగా పోటీలు ఏర్పాటు చేయడం కుస్తీకి ఎంత ఆదరణ ఉందో అద్దం పడుతుంది.
మేం నిర్మల్ జిల్లాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. మాకు తెలంగాణలోని ఏ జిల్లాలో ఎప్పుడు కుస్తీ పోటీలు
జరుగుతాయో క్యాలెండర్లో తేదీలను రాసుకుంటాం. ఆ తేదీల్లో ఇక్కడికి వచ్చి కుస్తీలు పడుతాం. కుస్తీలో
తలపడుతుంటే ప్రేక్షకుల సపోర్టు బాగా ఉంటుంది. గెలిచిన వారికి తెలంగాణలో ఊరేగింపు నిర్వహించడం, వెండి,
బంగారు కడియంతో ఆదరించడం బాగుంది.
– సంతోష్సిందే, పర్బని, మహారాష్ట్ర
మాది కుభీర్ మండలంలోని హల్దా గ్రామం. మా గ్రామంలో 30 మంది వరకు కుస్తీ పట్టేవారు ఉంటారు. మా మాస్టర్
వద్దకు వెళ్లి నాకు కుస్తీ నేర్పమని అడిగా. నువ్వు చదువుకునేటోడివి.. కుస్తీ ఎందుకని ప్రశ్నించాడు. కుస్తీ పడుతనని
పట్టుబట్టడంతో మా గ్రామంలోనే ఇసుక కుప్పలపై శిక్షణ ఇచ్చి టెక్నిక్స్ చెప్పారు. మూడేండ్ల నుంచి కుస్తీ పడుతున్నా.
ఇప్పటివరకు 50 పోటీల్లో పాల్గొన్న. అందులో 20 దాకా గెలిచిన.
– మారుతి, కుస్తీ వీరుడు