‘సానిదానికైనా నీతి ఉండాలి’ అని మధురవాణి పాత్ర ద్వారా చెప్పించారు గురజాడ క న్యాశుల్కం నాటకంలో. నైతికత ప్రాధాన్యా న్ని నొక్కిచెప్పాల్సిన సందర్భాల్లో చాలామంది ఈ మాట ఉటంకిస్తుంటారు కూడా. రాజకీయ వ్యభిచారం తారస్థాయికి చేరుకున్న ప్రస్తుత సందర్భంలో ఇది వెంటనే స్ఫురణకు రావడం లో వింతేమీ కాదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన పూర్వాశ్రమ వాసనలు పోనితనంతో చేస్తున్న వ్యాఖ్యల వల్ల. ఆదివారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధానం గా రెండు వ్యాఖ్యలు చేశారు. ఒకటి, తెలుగుదేశం పార్టీని తెలంగాణ నుంచి కేసీఆర్ తరిమేశారని చెప్పడం. రెండు, బీఆర్ఎస్ గద్దెలను కూల్చివేయాలని పిలుపు ఇవ్వడం.
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి, అవకాశం కలిసివచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనకు పచ్చకామెర్లు ఇంకా తగ్గలేదని ఈ వైఖరి సూచిస్తున్నది. కాంగ్రెస్, టీడీపీ సైద్ధాంతిక ఏకాభిప్రాయమున్న పార్టీలు గానీ, మిత్రపక్షాలు గానీ కాకపోయినప్పటికీ తన రాజకీయ గురువు, మాజీ బాస్‌పై రేవంత్‌రెడ్డి వల్లమాలిన ప్రేమ కురిపించడం గమనార్హం. ఆయన అంతవరకే పరిమితమైతే ఇది కాంగ్రెస్, టీడీపీ వ్యవహారంగానే పరిమితమై ఉండేది. కానీ బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని పిలుపునివ్వ డమే అసలు సమస్య. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఒక ప్రత్యేక పార్టీపై విషం కక్కడం, దాడులకు పిలుపునివ్వడం ఏమాత్రం క్షమించదగ్గ విషయం కాదనేది సుస్పష్టమే. కాంగ్రెస్ ఉప్పు తింటూ, టీడీపీతో సహజీవనం చేస్తూ మూడోపార్టీ పేరెత్తి జెండా గద్దెలను కూల్చాలని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రెచ్చగొట్టే వ్యా ఖ్యలు చేయటం ప్రజాస్వామ్యానికి అరిష్టమే కాదు..రాజ్యాంగ విరుద్ధమని చెప్పక తప్పదు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ-1, ఏ-2 ఇద్దరూ ఇపుడు ఇరుగుపొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు. ఆ కేసు ఇంకా కోర్టు విచారణలోనే ఉన్నది. ఆ సంగతి అలా ఉంచితే, టీడీపీ అనే పార్టీ ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, మరీముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు అనివార్యమైన పరిస్థితుల్లో ఆంధ్రకు పరిమితం కావడం ఎందుకు జరిగిందో ప్రజలకు తెలుసు. తెలంగాణ సోయి ఏమాత్రం లేని రేవంత్‌రెడ్డికి ఆ సంగతి తెలియదని అనుకోలేం. ఉలికిపాటుతో ఉద్యమకారులపైకి దాడికి రేవంత్ ఉరకలేస్తే ఆయన గురువు తెలంగాణ రాష్ట్ర సాధనకు అడుగడుగునా అడ్డుపడ్డారు.
ఇదేమీ ప్రజలకు అసలే తెలియని రహస్యమా? కేసీఆర్ చావునోట్లో తలపెట్టి కేంద్రం మెడలు వంచితే, ఉద్యమం ఫలించి తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమయ్యే వేళ కూడా ఢిల్లీలో దీక్ష పేరుతో సైంధవ పాత్ర పోషించింది టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనే సంగతి ప్రజలకు తెలుసు. రెండుకండ్ల సిద్ధాంతంతో గుడ్డిగా తెలంగాణను వ్యతిరేకించిన నేతకు ఇక్కడ పుట్టగతులు ఉంటా యా? అందుకే ఉపఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు రాలేదు. దుకాణం నడవక టీడీపీ, ఆ పార్టీ ఏకైక నేత ఇక్కడ నుంచి తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతే కేసీఆర్ మీద అక్కసు వెళ్లగక్కడం అవివేకం. కేసీఆర్ తన ప్రత్యర్థులను ద్వేషించలేదు.. దూషించలేదు. రాజకీయంగా ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో పరాజితులను చేశారు. అవును, టీడీపీని తరిమికొట్టారు. ప్రజాభీష్టానికే పట్టం కట్టారు.
ఇక బీఆర్ఎస్ జెండా గద్దెల గురించి సీఎం మాట్లాడిన మాటలు ఆయన నిస్పృహను వెల్లడిస్తున్నాయని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ తెలంగాణకు ఇంటిపార్టీ. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసింది, ఆ తర్వాత ప్రజాశీర్వాదంతో సుమారు దశాబ్దకాలంలో అద్వితీయమైన అభివృద్ధి సాధించి చూపింది కేసీఆర్. రెండేండ్లుగా కాంగ్రెస్ మార్కు ధోకేబాజీ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్న సంగతీ సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసు. మాయోపాయాలు ప్ర యోగించి, కేవలం రెండుశాతం ఓట్ల తేడాతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే దమ్మూ, ధైర్యం లేవని పైకి తెలుస్తూనే ఉన్నది. ప్రజల్లో బీఆర్ఎస్ బలం ఇనుమడిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రోజురోజుకూ బలపడుతున్న బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక అరాచకానికి తెరతీయాలని చూస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. నడమంత్రపు అధికారం, ముదనష్టపు రాజకీయానికి కర్రుగాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న సంగతీ ఆయనకు తెలుసు. అందుకే అంత అక్కసు.
తెలంగాణలో టీడీపీని పాతిపెట్టింది.. ఇక్కడి ప్రజలే. బాబును రాజకీయంగా తరిమికొట్టింది ఓటర్లు. డిపాజిట్లు గల్లంతై నేతలు పార్టీ వీడి వెళ్లిపోతుంటే, అది చాలదని ఓటుకు నోటు కేసు మెడకు చుట్టుకుంది. బతుకుజీవుడా అంటూ దుకాణం ఎత్తేసి పారిపోయింది బాబు. అయినా 2019 ఎన్నికల్లో మరోసారి తెలంగాణలో అడుగుపెట్టాలని కాంగ్రెస్‌తో కూటమి కడితే ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టి టీడీపీని భూస్థాపితం చేశారు. అప్పుడు మిగిలిన కొన్ని అవశేషాలు ఇవాళ రెచ్చిపోతున్నాయి.