కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వినూత్న కథా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం ద్వారా సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతున్నది. సోమవారం ఆమె ఫస్ట్‌లుక్‌తో పాటు క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేశారు.
ఓ పల్లెటూరి అమ్మాయి ఆకాంక్షలకు అద్దం పట్టే కథ ఇదని టీజర్‌ను చూస్తే అర్థమవుతున్నది. ‘రోడ్డు కూడా సరిగ్గా లేని ఈ ఊరు నుంచి ఆకాశానికి నిచ్చెన వేశావా? ఈ ఊరు పొలిమేర దాటి చూపించు చూద్దాం..’ అంటూ కథానాయికను సవాలు చేస్తూ ఓ వ్యక్తి చెప్పిన డైలాగ్ కథ తాలూకు భావోద్వేగాలను ఆవిష్కరించేలా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇప్పటివరకు 30శాతం చిత్రీకరణ పూర్తయిందని, వేసవిలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: గంగరాజు గుణ్ణం, నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం, దర్శకత్వం: పవన్ సాధినేని.