మన్సూరాబాద్, జనవరి 19: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముఠాలో ఇద్దరు పాత నేరస్తులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.8.50 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం, ముస్తపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వాణి అలియాస్ చిట్టి (26), అదే ప్రాంతానికి చెందిన గోగుల దానమ్మ (55), తమ్మిశెట్టి రాజు (32), తమ్మిశెట్టి నాగమణి (26) బంధువులు. ఆర్థికపరమైన ఇబ్బందులతో దొంగతనాలు చేయడం ప్రారంభించారు.
తమ్మిశెట్టి వాణి పాత నేరస్తురాలు.. ఆమెపై నందికొట్కూరు, తిరుపతిలో కేసులు ఉన్నాయి. గోగుల దానమ్మ పాత నేరస్తురాలు.. 1987 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నది. దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో వాణి, గోగుల దానమ్మ పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా వారిలో మార్పు రాలేదు. తమ్మిశెట్టి వాణి, గోగుల దానమ్మ, తమ్మిశెట్టి రాజు, తమ్మిశెట్టి నాగమణి ఒక ముఠాగా ఏర్పడ్డారు. నెలలో రెండు, మూడు పర్యాయాలు ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు. వాణి, దానమ్మ రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులను ఎంచుకుని ఫుట్‌బోర్డు వద్ద ప్రయాణికులను తోస్తూ మహిళల హ్యాండ్ బ్యాగుల నుంచి నగలను అపహరించేవారు. వాణి, దానమ్మ దొంగలిస్తున్న సమయంలో రాజు, నాగమణి ఇతరులపై నిఘా పెట్టడం, దొంగలించిన సొత్తును దాచిపెట్టడంలో సహాయంగా ఉంటారు.
జనవరి 8న కె.కృష్ణ నందిత అనే మహిళ ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులో నుంచి 60 గ్రాముల బంగారు ఆభరణాలను నలుగురు కలిసి దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు పాత నేరస్తులే దొంగతనానికి పాల్పడినట్లు గ్రహించి నిఘా పెట్టారు. వాణి, దానమ్మ, రాజు, నాగమణి నలుగురు ఆదివారం సాయంత్రం ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బస్సుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న విషయం బయటపడింది. నిందితుల నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జనవరి 8న మరో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధి, బీఎన్‌రెడ్డి నగర్లో ఓ మహిళ నుంచి 10 గ్రాముల బంగారు గొలుసును అపహరించారని పోలీసులు తెలిపారు. నిందితులైన తమ్మిశెట్టి వాణి, గోగుల దానమ్మ, తమ్మిశెట్టి రాజు, తమ్మిశెట్టి నాగమణిని రిమాండ్‌కు తరలించారు.